Cyclone Yaas : యస్ తుపాను ఎఫెక్ట్… 90రైళ్లు రద్దుచేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

బంగాళాఖాతంలో  ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది. 

Cyclone Yaas : యస్ తుపాను ఎఫెక్ట్… 90రైళ్లు రద్దుచేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

Cyclone Yaas Effect East Coast Railway Cancelled 90 Trains

Updated On : May 24, 2021 / 6:29 PM IST

Cyclone Yaas :  బంగాళాఖాతంలో  ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ… తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.   యస్ తుపాను గా నామకరణం చేసిన ఈ తుపాను,  మే 26 ఉదయానికి ఒడిషా బెంగాల్ రాష్ట్రాలమధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం యస్ తుపాను పారదీప్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో 530 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 28కి అది ఒడిషా లోని పారాదీప్-బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు  తెలిపారు.

యస్ తుపాను ఒడిషా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రప్రభావాన్ని చూపనుంది. ఈ నేపధ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. భువనేశ్వర్- పూరి , పూరి -చెన్నై మధ్య నడిచే 90 రైళ్లను రద్దు చేసింది. మరో 10 రైళ్ళను కూడా రద్దుచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 నుంచి 160కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 25నుంచి బెంగాల్ లోని కోస్తా జిల్లాలైన పుర్బా, పశ్చిమ మేదినిపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలతో పాటు హవ్ డా, హుగ్లీ, జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో యస్ తుపాను ఒడిషాలోని కోస్తా జిల్లాలైన బాలాసోర్, భద్రక్, జగత్ సింగ్ పూర్ లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

మరోవైపు యస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో  మే 25న అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమీషనర్ కన్నబాబు తెలిపారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా  ఉంటుందని వివరించారు.  సముద్రంలో అలలు 2.90 నుంచి 4.5 మీటర్లు ఎత్తుకు ఎగిసిపడతాయని ఆయన అన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కావున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.