Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ఏరియాల వాళ్లు బీ కేర్ ఫుల్.. వాహనదారులకు బిగ్ అలర్ట్..
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Hyderabad Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో వర్షం దంచికొడుతోంది. శనివారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. దాదాపు గంట నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది.
ఇటు వాతావరణ శాఖ నిన్ననే హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక నుంచి వర్షాలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందంది. వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా బృందాలు అప్రమత్తయ్యాయి.
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బేగంపేట, చార్మినార్, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, ఖైరతాబాద్, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అటు ట్రాఫిక్ పోలీసులు, లోకల్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో ఉన్న పురాతన భవనాల్లో ఉన్న వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పురాతన భవనాల్లో ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. భారీ వర్షాలకు పురాతన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున, అందులో ఉంటున్న వారు వాటిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. సాయంత్రం పూట కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిపర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారు. బేగంపేట, పంజాగుట్ట, ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాటిని క్లియర్ చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. మరో గంట పాటు వాన కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.
కుండపోత వానతో కార్వాన్ లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. శేరిలింగంపల్లి, చందానగర్ ఏరియాల్లో ఎక్కువ వర్షం పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 15 రోజుల క్రితం వరకు హైదరాబాద్ నగరంలో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు పడుతున్న వానలతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.