దక్షిణ కోస్తా, రాయలసీమకు వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమకు వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Ap Rains

Updated On : October 16, 2024 / 5:00 PM IST

Ap Rain Alert : ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాన గండం పొంచి ఉంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.

చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందని, నెల్లూరు తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరంవైపు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాకినాడ, గంగరం, విశాఖ పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అదే విధంగా మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని 4 మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

 

Also Read : తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం.. టీటీడీ కీలక నిర్ణయం