AP Rains: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం.. టీటీడీ కీలక నిర్ణయం

కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు భక్తులు వెళ్లకుండా నిలిపివేశారు.

AP Rains: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం.. టీటీడీ కీలక నిర్ణయం

TTD

Updated On : October 16, 2024 / 10:17 AM IST

TTD-Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయవ్య దిశగా గంటకు 10 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం తెల్లవారు జామున చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణి కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి – తడ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

Also Read: AP Rains: ఏపీలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశం.. విద్యా సంస్థలకు సెలవు

ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో టీటీడీ అప్రమత్తమైంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు భక్తులు వెళ్లకుండా నిలిపివేశారు. వర్షాల కారణంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. బుధవారం ఉదయం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. స్వల్పంగా రోడ్డుపైకి బండరాళ్లు వచ్చిపడ్డాయి. జేసీబీల ద్వారా బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా టీటీ ముందస్తు చర్యలు చేపట్టింది.

 

మరోవైపు ఏపీలోని ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జలదంకిలో అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కావలిలో 33.9 సెంటీమీటర్లు, ఇందుకూరు పేటలో 23 సెంటీ మీటర్లు, గుడ్లూరులో 20.5 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైంది. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరువాగు ఉద్దృతి పెరిగింది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులో వరద ఉధృతి పెరుగుతోంది.