AP Rains: ఏపీలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశం.. విద్యా సంస్థలకు సెలవు
వాయుగుండం గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని

Rain (Credit - Google Image)
Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి 440 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 460 కిలో మీటర్లు, నెల్లూరుకి 530 కిలో మీటర్లు దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. అయితే, ఈ వాయుగుండం గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. వాయుగుండం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకే సమయంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వాయుగుండం కారణంగా ఇవాళ (బుధవారం) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు.