IMD Warns Of Heat Waves : ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. ఆ 2 నెలలు జాగ్రత్త అంటున్న ఐఎండీ

వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

IMD Warns Of Heat Waves : ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. ఆ 2 నెలలు జాగ్రత్త అంటున్న ఐఎండీ

IMD Warns Of Heat Waves

IMD Warns Of Heat Waves : మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగతి వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడేలా ఎండలు ఉన్నాయి. అసలు ఉదయం 8గంటల నుండే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరిగిపోతోంది.

వేసవి కాలం ప్రారంభంలోనే ఇంత ఎండలు ఉండటంతో ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండల తీవ్రత పెరిగింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి కాలంలో ఎండలను తప్పించుకోలేనప్పటికి.. గత ఏడాది మే లో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం చల్లబడింది.

అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి లేదని, ఎండల తీవ్రత మామూలుగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వడగాలుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే రెండు నెలల పాటు ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లొదని అధికారులు చెబుతున్నారు.

శ్రావణి-హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి
మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నుంచి క్రమేపీ టెంపరేచర్స్ పెరిగే చాన్స్ ఉంది. మార్చి నెలాఖరులో క్రమేపీ పెరిగి సాధారణం కంటే ఒక డిగ్రీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్, మే నెలలో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాత్రి వేళ 19 నుంచి 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 2వ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరిగి సాధారణం ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఉత్తర భారత దేశంలో ఉన్న వెస్ట్రన్ డిస్టర్బన్స్ వల్ల రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ చల్లటి వాతావరణం కనిపిస్తుంది. మార్చి రెండో వారం నుంచి సాధారణ స్థితికి చేరుకుని వేసవి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Also Read : ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయం..! ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు, ఏపీ తెలంగాణలో మంటలే