Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. బీ కేర్ ఫుల్.. అధికారులకు మంత్రి అనిత కీలక ఆదేశాలు..

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.

Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. బీ కేర్ ఫుల్.. అధికారులకు మంత్రి అనిత కీలక ఆదేశాలు..

Updated On : October 22, 2025 / 7:50 PM IST

Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అలర్ట్ అయ్యారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు తీవ్ర అల్పపీడనం కదిలే అవకాశం ఉందన్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈరోజు రాత్రి బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఇవాళ, రేపు అత్యంత కీలకం అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరులో NDRF, SDRF బృందాలు.. ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల్లో SDRF బృందాలు మోహరించారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శిధిలావస్థ భవనాల్లో ఉండే వారిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వంటి పట్టణాల్లో డ్రైనేజ్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను 24/7 ఆపరేట్ చేయాలని చెప్పారు.

రోడ్డు మార్గాలకు అడ్డుగా విరిగిపడే కొమ్మలు, హోర్డింగ్స్ ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండ్ లెవెల్ లో విద్యుత్, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

Also Read: డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. భీమవరం డీఎస్పీపై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..