Raghu Rama Krishna Raju: డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. భీమవరం డీఎస్పీపై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..
ఈ అంశంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.

Raghu Rama Krishna Raju: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి పేరు ఉందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారని అన్నారు. అందుకే డీఎస్పీపైన అభియోగాలు వస్తున్నట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూదం శిబిరాలు లేవని రఘురామ తేల్చి చెప్పారు. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు.
”హీ ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెబుతాను. నాకున్న నాల్డెజ్ దృష్ట్యా అబ్జర్వ్ చేశాను. నాకున్న సమాచారం ప్రకారం అతను మంచి ఆఫీసర్” అని రఘురామకృష్ణరాజు అన్నారు.
భీమవరం డీఎస్పీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆయనపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏకంగా డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బంది.. హోంమంత్రిత్వ శాఖ అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న పేకాట శిబిరాలు, సివిల్ సెటిల్ మెంట్లలో డీఎస్పీ జయసూర్య తలదూరుస్తూ పవన్ కల్యాణ్ పేరును కూడా వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. హోంమంత్రి దీనిపై సమీక్ష చేసి అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ అంశంపై ఆరా తీశారు.
అయితే, తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో భీమవరం డీఎస్పీ జయసూర్య ఇష్యూపైనా ఆయన స్పందించారు. డీఎస్పీ జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ అని కితాబిచ్చారు. జయసూర్య చాలకాలంగా పని చేస్తున్నారు, ఆయనకు మంచి పేరే ఉందన్నారు. నిజాయితీగా పని చేస్తుండటం వల్ల ఆయనపై అటువంటి అభియోగాలు వస్తున్నాయేమో అనేది చూడాల్సి ఉందన్నారు.
డీప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యలతో భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం మలుపు తిరిగిందని చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బంది ఒకలా చెబుతుంటే.. అందుకు విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. డీఎస్పీ జయసూర్యను ఆయన వెనకేసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఈ అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Also Read: ఆ సీటుపై మెగా బ్రదర్ ఫోకస్..! వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?