కంపు కంపు : బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి రాజ్యం

టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ.

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 01:08 AM IST
కంపు కంపు : బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి రాజ్యం

టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ.

టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కేరాఫ్ అడ్రస్. తెలంగాణలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ. అదే సరస్వతీ క్షేత్రం బాసర ట్రిపుల్ ఐటీ. అక్కడ చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే.. ప్లేస్‌మెంట్ పక్కా అనే భరోసా అందరిలో ఉంది. దీంతో.. బాసర ట్రిపుల్ ఐటీలో సీటుకోసం పోటీ ఎక్కువగానే ఉంటోంది. చదువు సంగతి పక్కనబెడితే… బాసర ట్రిపుల్ ఐటీ ఇప్పుడు అవినీతికి అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు అధికారులు.. సరస్వతీక్షేత్రాన్ని అక్రమాలకు కేరాఫ్‌గా మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాజీవ్ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. టెన్త్ తర్వాత ఎంట్రెన్స్ రాసి ఎంట్రీ ఇస్తే.. ఆరేళ్ల తర్వాత మేటీ ఐటీ సంస్థల్లో ఉద్యోగం సంపాదించి దర్జాగా బయటకు రావొచ్చు. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించిన విద్యార్థులకు డ్రెస్, షూస్, ల్యాప్‌టాప్‌లాంటి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. 

అయితే… ట్రిపుల్ ఐటీలో చదువుకునే విద్యార్ధులు తాగే నీళ్ల నుంచి వేసుకునే దుస్తులు, షూస్, వాడుకునే ల్యాప్ ట్యాప్ వరకు ప్రతీ పనిలో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనులు చేపట్టాలంటే ఎక్కడైనా టెండర్ పిలుస్తారు. తక్కువ కోట్‌ చేసినవారికి ఆ పనులు అప్పగిస్తారు. కానీ.. ఈ యూనివర్సిటీ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా వెళుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
Also Read : టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

2018-19 విద్యాసంవత్సరంలో ట్రిపుల్ ఐటీ కోసం 1500 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ఇచ్చారు. పలు కంపెనీలు ముందుకు వచ్చినా… HP సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. ఇంతకీ వర్సిటీ కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ల ధర ఎంతో తెలుసా… ఒక్కోదానికి అక్షరాలా 51వేల 600 రూపాయలు. అదే సాఫ్ట్ వేర్ సేమ్ కాన్ఫిగరేషన్‌తో ఏసర్ కంపెనీ 36 వేల 950 రూపాయలకే అందిస్తామని టెండర్ వేసినా… పట్టించుకోలేదు. ఎందుకంటే… ఎవరికి టెండర్‌ దక్కాలో ముందే డిసైడైపోయింది. అందుకే ఎక్కువ ధర కోట్‌ చేసినా ఆ కంపెనీకే టెండర్ దక్కింది. అయితే.. ఈ డీల్‌లో 2 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈ అక్రమాలు బయటపడకుండా కొంత మందిని మేనేజ్ చేస్తున్న ఫోన్ సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణలో మాట్లాడుతున్న ఇద్దరిలో ఒకరు కీలక వ్యక్తికి పీఏగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం బయటపడకుండా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో కూడా ఫిక్స్ చేశారు. ఆడియోలోని సార్ అంటే ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీకి అధిపతిగా ఉన్న వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. ఇక.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్ల నిర్వహణ విషయానికి వస్తే.. వీటి నిర్వహణకు 96లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఇతర మంచినీటి శుద్ధికేంద్రాల్లో కోటి రూపాయలతో  ఏకంగా ఒక టీయంసీ నీటిని శుద్ధి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం అందులో వందో వంతు అంటే 0.003 టీఎంసీల నీటి శుద్ధికి దాదాపు కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. దీంట్లో కూడా భారీగా అవినీతి చోటుచేసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది.  

ట్రిపుల్ ఐటీలో టెండర్లను దక్కించుకునేది, కావాల్సిన సామగ్రిని అందించేది ఒక్క శివోహం సేల్స్ కార్పొరేషన్ కంపెనీ మాత్రమే. దీన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టినా… నోడల్ ఏజెన్సీ ద్వారా ఇప్పటికీ కావాల్సిన పనులు గుట్టుగా చక్కబెట్టేస్తోంది. ఈ అవినీతి పనుల్లో  ముఖ్య అధికారి చెప్పిందే చెల్లుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన ఆయన… తన పదవీ కాలం ముగిసేలోగా అడ్డదిడ్డంగా సంపాదించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే విద్యాసంవత్సరానికి కూడా.. ఇప్పుడే టెండర్లు పిలిచి అక్రమార్జనకు దారులు తెరిచాడు. అక్రమాల్లో తన పేరు బయటకు  రాకుండా ఆ అధికారి జాగ్రత్తపడుతున్నారని టాక్. ఎక్కడ కూడా డెరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాకుండా.. తన పీఏతో పనులు చక్కబెట్టేస్తాడని వినిపిస్తోంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరంటున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా ట్రిపుల్ ఐటీపై సర్కార్‌ దృష్టిసారించాలని.. అక్రమాలకు చెక్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : రైతులకు శుభవార్త : త్వరలోనే రైతు బంధు డబ్బులు