గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తడం లేదని, ఆత్మహత్యాయత్నం చేసిన ఆటోడ్రైవర్

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 11:08 AM IST
గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తడం లేదని, ఆత్మహత్యాయత్నం చేసిన ఆటోడ్రైవర్

తన గర్ల్ ఫ్రెండ్ తన కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రస్టేషన్‌కు గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.

ఆ యువకుడి పేరు దురై. వయసు 22ఏళ్లు. ఆటో డ్రైవర్. నార్తర్న్ చెన్నైలోని కరోనేషన్ నగర్ లో నివాసం ఉంటాడు. అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు అతడు తన గర్ల్ ఫ్రెండ్ ను చూడలేకపోయాడు. అయితే ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకునే వారు. చాటింగ్ చేసుకునేవారు.

ఏం జరిగిందో కానీ, సడెన్ గా అమ్మాయిలో మార్పు వచ్చింది. ఆమె, తన బాయ్ ఫ్రెండ్ ని పట్టించుకోవడం మానేసింది. యువకుడి ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేసేది కాదు. ఫోన్ చేసినా కట్ చేసేది. కొన్నాళ్లు ఆ యువకుడు వేచి చూశాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో యువకుడు ప్రస్టేషన్‌కు గురయ్యాడు. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. తను నివాసం ఉంటున్న బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.

అంత పైనుంచి కిందకు పడటంతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్ల ఎముకలు విరిగాయి. తీవ్ర గాయాలు కావడంతో నొప్పి భరించలేక దురై పెద్దగా ఏడ్వటం మొదలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడు స్పృహలో లేడని డాక్టర్లు తెలిపారు. చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

విషయం తెలుసుకున్న ఆర్కే నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. దురై ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి ఆరోగ్యం మెరుగు పడ్డాక స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. దురై ఓ అపార్టుమెంటులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోనూ అలాంటి దారుణమే జరిగింది. 16ఏళ్ల బాలుడు బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. బాలుడు, తన ఇంటి పక్కన నివాసం ఉండే వ్యక్తి ఐఫోన్ ని పొరపాటున పాడు చేశాడు. అది చాలా కాస్ట్లీ ఫోన్. దీంతో అతడు కోపంతో ఊగిపోయాడు. తన ఫోన్ ని పాడు చెయ్యడం తట్టుకోలేక, బాలుడిని టార్చర్ పెట్టాడు. రూ.62వేలు చెల్లించాలని బాలుడి తండ్రిని డిమాండ్ చేశాడు. అయితే అతడు పేదవాడు కావడంతో అంత డబ్బు చెల్లించలేకపోయాడు. దీంతో ఆ వ్యక్తి బాలుడిని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఇది భరించలేకపోయిన బాలుడు భవనం పైనుంచి కిందకు దూకేశాడు.