తెలంగాణలో వరదలు, ముగిసిన కేంద్ర బృందం పర్యటన

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 07:12 AM IST
తెలంగాణలో వరదలు, ముగిసిన కేంద్ర బృందం పర్యటన

Floods in Telangana, Central team tour ends : తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందాలు.. వర్షాలతో జరిగిన ఆస్తి, ప్రాణ, పంట నష్టాల వివరాలను సేకరించాయి. హైదరాబాద్‌ వరదల నష్టాన్ని అంచనా వేశాయి. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం, అక్టోబర్ 25వ తేదీ ఆదివారం వరద నష్టాంపై కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు. అయితే తెలంగాణ అధికారులు కూడా కేంద్ర బృందానికి వరద నష్టాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించారు. రాష్ట్రానికి సాయమందేలా చూడాలని కోరారు.

రెండో రోజు కేంద్ర బృంద పర్యటన :-
హైదరాబాద్‌ వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలతో మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించి.. వరద నష్టాన్ని సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు అంచనా వేశారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వంలో.. కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ రఘురామ్, కేంద్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ కుష్వారా నగరంలో పర్యటించారు.

పునరావాస , పునరుద్ధరణ పనులపై ఆరా :-
నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి ఓవర్ ఫ్లో అయి నాలాల్లోకి వస్తున్న వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు.. స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్.. హయత్‌నగర్ సర్కిల్, రాజరాజేశ్వరి కాలనీలో ముంపునకు గురైన ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది. ప్రభుత్వ పరంగా చేపట్టిన సహాయ, పునరావాస , పునరుద్ధరణ పనుల గురించి తెలుసుకున్నారు.
https://10tv.in/what-is-the-reason-for-floods-in-hyderabad/
నాలాల విస్తరణ :-
దెబ్బతిన్న రోడ్లు, నాలాలు, చెరువు కట్టలు పునరుద్ధరణకు చేపట్టిన చర్యలు గురించి అధికారుల నుంచి కేంద్ర బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నందున, చెరువుల పటిష్టతకు, నాలాల విస్తరణకు చేపడుతున్న చర్యల గురించి సమాచారం సేకరించారు. నాగోల్‌, బండ్లగూడ, బైరామల్‌గూడ చెరువుల నాలాల నుంచి వచ్చే వరద నీటిని మూసీలో కలిపేందుకు శాశ్వత ప్రాతిపదికన నాలాలను అభివృద్ధి చేయనున్నట్టు ఈ సందర్భంగా నీటి పారుదల, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. అందుకు అనువుగా డిజైన్లను రూపొందించడానికి కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్టు వివరించారు.

పునరావాస , పునరుద్ధరణ పనులపై ఆరా :-
భారీ వర్షాలు, పైన ఉన్న చెరువుల నుండి వచ్చిన వరదతో నాగోల్ ప్రాంతంలోని పలు కాలనీలు, ఇండ్లు దాదాపు 6 అడుగుల మేర నీటి ముంపుకు గుర‌య్యాయ‌ని బాధిత కుటుంబాలు కేంద్ర కమిటీకి వివరించాయి. ఈ ప్రాంతానికి మూసి నది ఒక కిలోమీటర్ వున్నదని, వరదతో పాటు పైన ఉన్న అన్ని చెరువులను అనుసంధానం చేస్తూ, ఓవర్ ఫ్లో అయ్యే నీటిని మూసి నదిలో కలిపేందుకు నాలాను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల, జి.హెచ్.ఎం.సి అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.



వరద ముంపునకు శాశ్వత పరిష్కారం :-
వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం మూసీకి కలుపుతూ
నాలాను విస్తరింపజేసేందుకు అనువైన డిజైన్ల తయారీకి కన్సల్టెన్సీ కి అప్పగించనున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు సెంట్రల్ టీంకు తెలిపారు.
కర్మన్‌ఘాట్‌ మేఘా ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న మీర్‌పేట నాలాను, బైరామల్‌గూడ నాలాల నుంచి వచ్చిన వరద నీటితో ముంపుకు గురైన కాలనీలను కేంద్ర బృందం పరిశీలించింది.



సరూర్ నగర్ చెరువు పరిశీలన :-
మీర్‌పేట, బైరామల్‌గూడ చెరువుల నాలాల ఉధృతితో ఈ ప్రాంతంలోని ఉదయ్‌నగర్, మల్‌రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్‌ కాలనీలోదాదాపు 2వేల ఇళ్లు ముంపుకు గురైనట్టు అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సరూర్‌నగర్‌ చెరువును కూడా కేంద్ర బృందం పరిశీలించింది.



కేంద్ర బృందానికి స్థానికుల నివేదన :-
టోలీచౌకీలోని వారసత్‌నగర్‌, బాల్‌రెడ్డినగర్‌, నదీమ్‌ కాలనీల్లో సెంట్రల్‌ టీమ్‌ పర్యటించింది. సాతం చెరువు నీటి ఉధృతితో మునిగిన కాలనీలు, రోడ్లను పరిశీలించింది. ఆయా ప్రాంత ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. 7నుంచి 11 అడుగుల వరకు వరద వచ్చినట్టు స్థానికులు కేంద్రబృందానికి వివరించారు. తమకు తీవ్ర నష్టం కలిగిందని.. కేంద్రమే న్యాయం చేయాలని కోరారు.



నీట మునిగిన పంటల పరిశీలన :-
అటు జిల్లాల్లోనూ మరో బృందం పర్యటించింది. వర్షాలు వరదలతో నీట మునిగిన పంటను బృందం సభ్యులు పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు సేకరించారు. తెలంగాణలో సుమారు 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. క్షేత్ర స్థాయిలో నష్టాన్ని అధికారులు పరిశీలించారు. మొత్తానికి తెలంగాణలో రెండు రోజులు పర్యటించిన కేంద్ర బృందాలు… రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపై కేంద్రానికి నివేదిక అందజేయనున్నాయి.