తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి

ఈ సభ నుంచి మోదీ దేశం కోసం, ధర్మం కోసం మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు బీబీ పాటిల్ చెప్పారు.

తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి

PM Narendra Modi

తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ శివారులో భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.

అల్లాదుర్గ్‌లో విశాల్ జనసభ పేరుతో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మధ్యలో ఉండే అల్లాదుర్గంలో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు రెండు లక్షల మంది జనాన్ని సమీకరిస్తున్నారు.

జనం పెద్ద ఎత్తున తరలి రావాలని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పిలుపునిచ్చారు. విశాల్ జనసభ ఏర్పాట్లను బీబీ పాటిల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం, ధర్మం కోసం నిర్వహిస్తున్న ఈ సభలో ప్రధాన మంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు.

అల్లాదుర్గ్ కు మోదీ రావటం పట్ల జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ప్రధాని ఉపన్యాసం వినాలని వారు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభ నుంచి మోదీ దేశం కోసం, ధర్మం కోసం మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని అన్నారు. అభివృద్ధి అంటేనే బీజేపీ అని, ప్రజలు తమకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

 Also Read: ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై టీడీపీ సస్పెన్షన్ వేటు