Kcr : ఎన్టీఆర్‌ని ‌మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో కలిసినట్లే.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు

Kcr : ఎన్టీఆర్‌ని ‌మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Kcr About NTR (Photo Credit - Facebook BRS Party)

Kcr : కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రానికి ఒక్క పని కూడా చేయని కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని తెలిపారు కేసీఆర్. కరెంటు కోతలపై మంత్రి భట్టి విక్రమార్క తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం నగరానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మయూరి సెంటర్ నుండి రోడ్ షో సాగింది. అంబేద్కర్ సెంటర్ లో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు.

”నామా నాగేశ్వరరావు జిల్లా, రాష్ట్రం బాగుపడాలని ఆరాట పడుతున్నారు. తెలంగాణలో పంటలు పంజాబ్ ను తలదన్నేలా చేరాం. కేంద్రంలో మద్దతు ధర అడిగితే.. మెదడు తక్కువ కేంద్ర మంత్రి నూకలు తినమన్నారు. ఢిల్లీలో ఎంపీలు, ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తే బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు. గోదావరి నదిని నేను ఎత్తుకుని పోతానని మోదీ స్పష్టంగా చెబుతున్నారు. తమిళనాడు, కర్నాటకకు ఇస్తానని అంటున్నారు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది. మరి ఒక్కరైనా మాట్లాడుతున్నారా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా? మరి ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? గోదావరిలో దుమ్ముగూడెం ప్రాజెక్టుపై సీతారామ కడుతున్నాం.

ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. ఖమ్మంలో ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలుపొందితే కేంద్ర మంత్రి అవుతారు. నేను ఒక్కడిగా బయలుదేరితే తెలంగాణ వస్తుంది అన్న నమ్మకం లేదు. అమరణ నిరాహార దీక్ష చేస్తే ఖమ్మం జైలుకి తీసుకొచ్చారు. ‌‌కమ్యూనిస్టులు అండగా నిలిచారు. నేను మరిచిపోలేను.

కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆయన నోటికి మొక్కాలి. నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీఆర్ వచ్చాకనే. పేదలకు బుక్కెడు బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది చరిత్ర… నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చెయ్యలేదు. ఎన్టీఆర్ వచ్చాకే ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు. చరిత్రను తుడిస్తే పోదు. ఆ తర్వాత  తెలంగాణ వచ్చాక.. ఎన్టీఆర్ ని మించి  సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేశాం. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, ధాన్యం కొనుగోలు.. ఇలా అన్ని రకాలుగా చేసుకున్నాం.

కల్యాణ లక్ష్మి, తులం బంగారం తుస్సుమంది. అడిగితే కాంగ్రెస్ కస్సుమంది. రైతు భరోసా అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. రైతుల చెప్పుల బలంగా ఉంటాయి. కరెంటు మంత్రి.. భట్టి విక్రమార్క కాదు.. వట్టి విక్రమార్క. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళు ఇవ్వలేని వారి సమస్యలపై ట్విట్టర్ లో పెట్టా. భట్టి విక్రమార్క చర్యలు తీసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదు. భద్రాద్రి రామయ్య, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు అన్నారు. ఎన్ని ఒట్లు వేస్తారు? హరీశ్ రావు రాజీనామా చేస్తానని వెళ్లారు. సీఎం తోక ముడిచారు. పండబెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైలుకి పంపుతా.. పేగులు తీసి మొడలో వేసుకుంటా.. అని సీఎం మాట్లాడటం సరైందేనా? నేను జైలుకి భయపడును. అబద్దాలు చెప్పే వీళ్లు.. ఎక్కువ కాలం ఉండలేరు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంకటరెడ్డి బీజేపీలోకి జంప్ అంటే సీఎం ఖండించటం లేదు. మా హయాంలో నాగార్జున సాగర్ కింద పంటలు ఎండనీయ లేదు. ఇప్పుడు పంటలు ఎండిపోయాయి. కరెంటు లేదు, రైతుబంధు రాలేదు. యుద్ధం చేద్దామా? పోరాడదామా? ఖమ్మం పట్టణంలో మూడు రోజులకో సారి నీళ్ళు ఇస్తున్నారు. తొమ్మిది ఏళ్ల హయాంలో నీళ్ళు ఇచ్చాము. ఇదే జిల్లాకి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి.. పక్క జిల్లాలో నీటి మంత్రి ఆలోచన చేయాలి. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకుందాం. ఖమ్మం, కొత్తగూడెంకి 2 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో కలిసినట్లే.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు” అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

Also Read : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం.. ఏం జరగనుంది?