ఏపీ పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కోర్ట్ తీర్పుపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కోర్ట్ తీర్పుపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌

AP Panchayat Elections .. SEC Writ Petition on High Court Judgment : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ వెనక్కి తగ్గలేదు. కోర్ట్ తీర్పుపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్‌ చేసింది. కరోనా వ్యాక్సిన్ వేసినా ఇబ్బంది లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న విషయంపై పిటిషన్‌లో వివరించనుంది ఎస్‌ఈసీ. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సహకరించలేదని అందుకు గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు, తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ ను కోర్టు ముందుకు తీసుకురానుంది ఎస్ఈసీ.

అంతకు ముందు ప్రభుత్వానికి ఊరటనిస్తూ ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. ఎన్నికలపై SEC నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించిందని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందేనని తేల్చి చెప్పింది.

ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. వ్యాక్సిన్‌ ఇవ్వడం ఎన్నికల ప్రక్రియకు అడ్డం కాదని.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను ఆపలేమని, ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోందని SEC ధర్మాననానికి తెలిపింది.

అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు కరెక్ట్‌ కాదని.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21లను ఉల్లంఘించేలా ఎస్‌ఈసీ నిర్ణయం ఉందని ఏజీ కోర్టుకు వివరించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది.