కర్ణాటకలో కరోనా విజృంభణ.. బెంగళూరు అపార్ట్‌మెంటుకు సీల్

కర్ణాటకలో కరోనా విజృంభణ.. బెంగళూరు అపార్ట్‌మెంటుకు సీల్

Bengaluru apartment sealed rising Covid cases : దేశంలో మహారాష్ట్ర, కేరళలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రెండు రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే ప్రస్తుతానికి కర్ణాటకలో కరోనా పరిస్థితులు ఆందోళనకర స్థితికి చేరుకోలేదు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా కరోనా ఆంక్షలను విధించారు. బెంగళూరులో కరోనా అలర్ట్ ప్రకటించారు.

ఇందులో భాగంగా ఎస్ జేఆర్ వాటర్ మార్క్ అపార్ట్ మెంట్ కు సీల్ వేశారు. ఈ అపార్ట్ మెంటులో ఫిబ్రవరి 15 నుంచి 22 మధ్య తేదీల్లో దాదాపు 10వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రుహట్ బెంగళూరు మహాన్ గారా పాలైక్.. ఈ అపార్ట్ మెంటులో ఆరు బ్లాకులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. అపార్ట్ మెంట్ ప్రాంగణంలో శానిటైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఆరోగ్య బృందాలు, నలుగురు వైద్యులను కూడా అపార్ట్ మెంట్ వద్ద నియమించారు. ఈ అపార్ట్ మెంట్ ఆగ్నేయ బెంగళూరు ఉపనగరమైన బెల్లందూర్ లో ఉంది. మొత్తం 9 బ్లాకులు ఉండగా.. 1500 మంది వరకు నివసిస్తున్నారు. ఇతర మూడు బ్లాకులను ఈ ఆరు బ్లాకులతో కనెక్టవిటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటివరకూ ఈ మూడు బ్లాకుల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని మంజుశ్రీ నర్సింగ్ కాలేజీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 40మంది నుంచి శాంపిల్స సేకరించగా అందరికి పాజిటివ్ అని తేలింది. సోమవారం వరకు కర్ణాటకలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదు కాగా.. బెంగళూరు పట్టణ ప్రాంతంలో 181 కేసులు నమోదయ్యాయి. బెంగళరూ అర్బన్ జిల్లా పాజిటివ్ కేసుల్లో టాప్ లో నిలిచింది. మొత్తంగా రాష్ట్రంలో 4,03,943 కరోనా కేసులు నమోదు కాగా.. మైసూరులో 53,941, బల్లారిలో 39,221 కరోనా కేసులు నమోదయ్యాయి.