ఫడ్నవీస్-రాజ్ ఠాక్రే మీటింగ్…మహారాష్ట్రలో కొత్త మిత్రులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2020 / 10:06 AM IST
ఫడ్నవీస్-రాజ్ ఠాక్రే మీటింగ్…మహారాష్ట్రలో కొత్త మిత్రులు

మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు విరోధులుగా ఉన్న ఈ ఇద్దరూ సమావేశమై ఏం చర్చించారన్నది ఆశక్తిగా మారింది. 

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సొంత బాబాయి కొడుకైన రాజ్ ఠాక్రేతో మంగళవారం గంటసేపు ఫడ్నవీస్ సమావేశమవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏం లేదని చెప్పలేం. మహా రాజకీయాల వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం…బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి గతేడాది నవంబర్ లో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో శివసేన ఖాళీ చేసిన “హిందుత్వ” స్పేస్ ను ఎమ్ఎన్ఎస్ క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఉద్దవ్-రాజ్ ఠాక్రే సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ కూడా అక్టోబర్ 21 ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ రంగంలో నిర్మాణాత్మక మార్పుకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షాపై ఎమ్ఎన్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చే స్థాయిలో కాకున్నా కనీసం ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉండేలా ప్రజలు ఆశీర్వాదించాలని ఎన్నికల సమయంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రజలను అభ్యర్థించాడు. అయితే కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే ఎన్ఎమ్ఎస్ గెల్చుకోగలిగింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు,ఉనికిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎమ్ఎన్ఎస్ చతికిలబడిపోయిన విషయం తెలిసిందే. ఇలా పార్టీ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2009 నాటి నుంచి పెద్దగా ప్రభావం చూపలేకపోతూ వచ్చింది. ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన వ్యూహాలు మార్చాలని డిసైడ్ అయ్యారు.

ఎంఎన్ఎస్ తన పార్టీ రంగులను కాషాయ రంగులోకి మార్చడం,ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అద్భుతమైన పాలనను ప్రేరేపించే కొత్త డిజైన్ జెండాతో సరికొత్తగా ముందుకురావాలని ఎమ్ఎన్ఎస్ ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే పార్టీ ముఖ్య సమావేశంలో రాజ్ ఠాక్రే దీనిపై ఫైనల్ నిర్ణయం ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. శివసేన ఖాళీ చేసిన హిందుత్వ వాదాన్ని భుజానకెత్తుకుని బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా చూపించాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్ఎన్ఎస్ భావిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో ఎమ్ఎన్ఎస్ తో భవిష్యత్తు అడుగులు వేసేందుకు రెడీగా ఉన్నట్లు అర్థవుతుంది.