ఆర్థిక ప్యాకేజీ :పరిశ్రమలకు 20 శాతం అదనంగా లోన్లు..కార్మికులకు మూడు నెలల వేతనాలు!

కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఒడిదొడుకులకు గురైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
2020, మే 13వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను తెలియచేయనున్నారు. ప్యాకేజీ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్యాకేజీలో ఏ ఏ రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారనేది తెలియరావడం లేదు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ప్రకారం..కుటీల పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమ, MSMEలు, కార్మికులు, రైతులు, మధ్య తరగతి పన్ను చెల్లింపు దారులు, భారతీయ పరిశ్రమల్లోని వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్యాకేజీని రూపొందించారని తెలుస్తోంది. భూమి, కార్మిక చట్టాల్లో సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు.
ఏడాది పాటు లోన్లపై మారటోరియం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజిష్టర్ చేసుకున్న పరిశ్రమలకు 20 శాతం అదనంగా లోన్లు ఇవ్వనున్నారని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలను ప్రభుత్వమే చెల్లించే అవకాశాలున్నాయని సమాచారం.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్యాకేజీతో మధ్యతరగతి, కర్షకులు, పేదలు, కార్మికులు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు తెలిపారు.
నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని… ప్యాకేజీకి సంబంధించిన వివరాల్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని ప్రకటించారు. ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుందని వెల్లడించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. మరి ప్యాకేజీ ఎలా ఉండనుందో కాసేపట్లో తెలియనుంది.
Read More: