కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పేదలకు పనికిరాదు: చిదంబరం

కేంద్రం ప్రకటించిన కోవిడ్ -19 ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడం దారుణం అని అన్నారు. ఆకలితో మలమలలాడుతూ వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికుల గరించి కేంద్రం కనీసం అందులో ప్రస్తావించకపోవడం అవమానీయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
పేదలను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పేదలకు పనికిరాదని ఆయన అన్నారు. నిర్మలా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కేవలం పెద్ద ఎంఎస్‌ఎంఈల కోసమేనని చిదంబరం విమర్శించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందన్నారు.
దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, 13 కోట్ల కుటుంబాలు లాక్‌డౌన్ కారణంగా నష్టపోతే ప్రభుత్వం వారికి సాయం చెయ్యలేకపోయిందని అన్నారు. ప్రభుత్వం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే 13 కోట్ల కుటుంబాల చేతిలో డబ్బు పెట్టడం. ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వానికి 65,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన అన్నారు.