విజయ్ మాల్యాకు బిగ్ షాక్…28రోజుల్లో భారత జైలుకు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 04:13 PM IST
విజయ్ మాల్యాకు బిగ్ షాక్…28రోజుల్లో భారత జైలుకు

భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ దిగ్గజం విజయ్‌ మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించాలని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించడాన్ని సవాల్‌ చేస్తూ యూకే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు.  భారతదేశానికి తనను అప్పగించే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాననే పిటిషన్‌ ను ఇవాళ యూకే హైకోర్టు తోసిపుచ్చింది.

మాల్యాపై అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంతో తన అప్పగింతను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేసేందుకు మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో భారత్‌-బ్రిటన్‌ ఒప్పందం ప్రకారం 28 రోజుల్లో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కోర్టు ఉత్తర్వులను బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతి పటేల్‌ ధ్రువీకరిస్తారని భావిస్తున్నారు.

బ్రిటిష్‌ చట్టాల ప్రకారం… 28 రోజుల వ్యవధికి తక్షణమే కౌంట్‌ డౌన్‌ ప్రారంభవుతుందని, నెలరోజుల లోపే మాల్యా భారత్‌లో ఉంటారని భారత దర్యాప్తు సంస్ధల వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తరపున రూ 9000 కోట్లు రుణాలు పొందిన విజయ్‌ మాల్యాకు వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం లేదని బ్యాంకులు ఆరోపిస్తుండగా, రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెప్పుకొస్తున్నారు. రుణ ఎగవేత కేసులో అరెస్టయిన మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. 

మరోవైపు ఇవాళ ఉదయం…తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 100శాతం చెల్లిస్తానని,తన ఆఫర్ ను భారత ప్రభుత్వం అంగీకరించి తనపై చేసిన మనీలాండరింగ్,మోసం వంటి కేసులను మూసివేయాలని మాల్యా ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.