BRS Party: బీఆర్ఎస్‌లో దూకుడు పెంచుతున్న అసంతృప్తులు, ఆశావహులు.. కాంగ్రెస్ తో టచ్‌లోకి కొందరు నేతలు!

ఈసారి తమకు టికెట్ కష్టమేననే అంచనాకు వచ్చిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

BRS Party: బీఆర్ఎస్‌లో దూకుడు పెంచుతున్న అసంతృప్తులు, ఆశావహులు.. కాంగ్రెస్ తో టచ్‌లోకి కొందరు నేతలు!

BRS Party Dissidents Aspirants touch with congress leaders

BRS Party Aspirants: ఇంకొన్ని నెలల్లో రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు.. అధికార బీఆర్ఎస్ వేగంగా అడుగులేస్తోంది. ఇదే సమయంలో.. పార్టీలో ఉన్న అసంతృప్తులు, ఆశావహులంతా.. గ్రౌండ్ లెవెల్‌లో దూకుడు పెంచుతున్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ (Congress) వైపు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో.. అలాంటి వాళ్లందరికీ బ్రేకులు వేసేందుకు గులాబీ దళపతి కేసీఆర్ (KCR) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఇప్పట్నుంచే.. తాము ఆశ‌లు పెట్టుకున్న స్థానాల్లో పోటీ చేసేందుకు అనుగుణంగా.. పావులు కదుపుతున్నారు. అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య పోరు ఎక్కువ‌గా ఉండ‌డంతో.. గులాబీ నేత‌లు ప‌క్క చూపులు చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత.. అసంతృప్తుల చూపు కాంగ్రెస్ మీదకు మళ్లిందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ టికెట్ రాకపోతే.. పార్టీ మారతారని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు.

ఇప్పటికే.. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి(Jupally), మాజీ ఎంపీ పొంగులేటి(Ponguleti), మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో.. మిగతా నేతలు కూడా వారి దారిలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గాల్లో.. వలస రాజకీయాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. కారు ఓవర్ లోడ్ అవడంతో.. వీలైనంత త్వరగా కారు దిగేందుకు ఒక్కొక్కరు తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.

Also Read: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కీలక నేత రాజీనామా.. ఎందుకంటే?

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, వేముల వీరేశం, మలిపెద్ది సుదర్శన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ మందుల సామెలు సహా.. మరికొందరు.. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలున్నాయి. ఈసారి తమకు టికెట్ కష్టమేననే అంచనాకు వచ్చిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల నేతలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో.. పార్టీలో వలస నేతల లోటు కనిపించకుండా అమలు చేయాల్సిన వ్యూహాలకు.. కేసీఆర్ పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: నా కూతురిని అడ్డుకోండి.. హైకోర్టుని ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అయితే.. బీఆర్ఎస్ వీడుతున్న వాళ్లలో మెజారిటీ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసమే చూస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో.. పార్టీ మారిన నేతలను టార్గెట్ చేస్తూ.. బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కాదనుకున్న నేతలే.. కొత్త దారులు వెతుక్కుంటున్నారని.. ఇలాంటి నేతలతో తమకెలాంటి నష్టం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇలాంటి నేతలను దృష్టిలో ఉంచుకొనే.. అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా కూడా ఖరారు చేస్తే.. పార్టీ నేతల వలసలపైనా స్పష్టత వస్తుందని.. సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.