Telangana BJP: కమలం పార్టీకి మరో కొత్త చిక్కు.. నెత్తి నొప్పి తెచ్చిన నేతల భద్రత

తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.

Telangana BJP: కమలం పార్టీకి మరో కొత్త చిక్కు.. నెత్తి నొప్పి తెచ్చిన నేతల భద్రత

Eatala Rajender, Dharmapuri Arvind

Telangana BJP –  Y category security: తెలంగాణలో బీజేపీ పార్టీకి వివాదాలు వెంటాడుతున్నాయి.. నాయకత్వ మార్పుకు ముందు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తలలు పట్టుకున్న పార్టీ పెద్దలకు ఇప్పుడు నేతల భద్రత నెత్తి నొప్పి తెచ్చింది.. పార్టీ నేతలు ఈటెల రాజేందర్ (Eatala Rajender), ‌ ధర్మపురి అరవింద్ (dharmapuri arvind) కు కేంద్రం వై కేటగీరి భద్రత కల్పించడమూ ఇప్పుడు కాంట్రవర్సీకి కారణమైంది.. అర్హత ఉన్న నేతలు ఎందరో ఉన్న వీరిద్దరికేనా భద్రత అంటూ పార్టీలో కొందరు ప్రశ్నిస్తున్నారు.. బీజేపీలో ఎప్పుడూ లేని సంస్కృతి కనిపించడానికి కారణమేంటి.. తెర వెనుక ఏం జరుగుతోంది?

తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎన్నికల ముందు అంతర్గత సమస్యలు పెరిగిపోతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపు.. గుర్తింపు దక్కడం లేదని సీనియర్ల తిరుగుబాటు.. పాత.. కొత్త నేతల మధ్య అంతరం వంటి సమస్యలతో ఇన్నాళ్లు నలిగిపోయిన కమలం పార్టీకి ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చిపడింది. రాష్ట్ర బీజేపీ నేతల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. కేంద్ర సంస్థలు భద్రత కల్పించడం తాజా వివాదానికి కారణంగా మారుతోంది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సీనియర్ నేత ఈటల రాజేందర్ భద్రతపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈటలకు ప్రాణ హాని ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించడంతో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తామని ముందుకు వచ్చింది. అయితే బీఆర్ఎస్ నాయకుల నుంచే ఈటలకు ముప్పు ఉందనే విమర్శల నేపథ్యంలో ఈటలకు భద్రత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ వివాదం ఇలా ఉండగానే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చింది. సీఆర్పీఎఫ్ జవాన్లతో ఈటలకు రక్షణ కల్పించింది. అదేసమయంలో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కూడా వై కేటగిరీ భద్రత కేటాయించింది. ఇదే ఇప్పుడు కమలదళంలో కాకరేపుతోంది. బిజేపీలో ఎందరో ముఖ్యనేతలు ఉండగా ఈ ఇద్దరికే కేంద్ర సెక్యూరిటీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు

ఈటల, అర్వింద్‌పై గతంలో దాడి యత్నాలు జరిగినందునే సెక్యూరిటీ ఇచ్చినట్లు బీజేపీ పెద్దలు చెబుతుండగా అవే తరహా దాడులు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పైనా జరిగాయని.. వారికెందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో అందరికన్నా ఎక్కువ రిస్క్ రాజాసింగ్కే ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినా పార్టీలో కొనసాగినప్పుడైనా భద్రత ఇవ్వాల్సింది కదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Also Read: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

ఈటల, అరవింద్‌కి సెక్యూరిటీ ఇవ్వడంపై బహిరంగంగా అభ్యంతరం చెప్పకపోయినా తమకు మాటమాత్రమైనా అడగాల్సింది కదా అంటూ కక్కలేక మింగలేక గొణుక్కుంటున్నారట కమలం పార్టీ నేతలు. కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కుదుటపడుతుందని జోరు పెంచొచ్చని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ కొత్త వివాదం బీజేపీలో కలకలం రేపుతోందట.