Medak Constituency: యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్ర కరవు.. ఎవరా యంగ్ లీడర్?

ఓ వైపు సీనియర్ నేత.. మరోవైపు యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు మెదక్ బరిలో చివరకు ఎవరుంటారనేది సందిగ్ధంగా మారింది.

Medak Constituency: యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్ర కరవు.. ఎవరా యంగ్ లీడర్?

Medak Assembly Constituency Ground Report

Medak Assembly Constituency: మెదక్ అసెంబ్లీ సీట్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార బీఆర్ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. టిక్కెట్ కోసం అశలు పెంచుకుంటున్న నేతలంతా ఆఖరి నిమిషంలో ఏం చేస్తారోనని టెన్షన్ ప్రతిపార్టీలోనూ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి (padma devender reddy) మళ్లీ పోటీకి రెడీ అవుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా రెండు గ్రూపులు బలంగా పనిచేస్తున్నాయంటున్నారు. బీఆర్ఎస్ (BRS Party) సీనియర్ ఎమ్మెల్యేగా పద్మ ఈ అసంతృప్తులను ఎలా అరికడతారు.. వ్యతిరేకులను దారిలోకి తెచ్చుకుని మళ్లీ గట్టెక్కగలరా.. బీఆర్‌ఎస్‌ను దీటుగా ఢీకొట్టే ప్రత్యర్థి పార్టీ ఏంటి? మెదక్‌లో ఈసారి కనిపించే సీనేంటి?

Padma Devender Reddy

Padma Devender Reddy

మెదక్, పాపన్నపేట, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట (Ramayampet), నిజాంపేట మండలాలతోపాటు రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలతో కలిపి ఏర్పడింది మెదక్ నియోజకవర్గం. మొత్తం 2 లక్షల 2 వేల 633 మంది ఓటర్లు ఉండగా… ఇందులో పురుషులు 97 వేల 556 మంది, మహిళా ఓటర్లు లక్ష 5 వేల 77 మంది ఉన్నారు. 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగిన మెదక్ నియోజకవర్గంలో.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2009 వరకు సైకిల్ జోరు సాగింది. ఇక తెలంగాణా ఆవిర్భావం తర్వాత తిరుగులేని శక్తిగా మారింది కారు పార్టీ.. వరుస విజయాలతో ఊపు మీద సాగుతోంది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే.. టీడీపీ ఆరుసార్లు, కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచింది.

Seri Subhash Reddy

Seri Subhash Reddy

తెలంగాణ ఆవిర్భవం తర్వాత వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్‌ తరఫున పద్మా దేవేందర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. తను చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. అయితే ఆమెపై ఇటు క్యాడర్లోను అటు జనంలోనూ వ్యతిరేకత కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. రామాయంపేట రెవిన్యూ డివిజన్ హామీని నిలబెట్టుకోకపోవడం కూడా ఆమెపై వ్యతిరేకతకు కారణంగా చెబుతున్నారు. స్థానికులు అఖిలపక్షంగా ఏర్పడి కొన్ని నెలలుగా రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతున్నారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం గెలుపుపై ఆశలు పెట్టుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డికి ప్రత్యర్థుల కన్నా ఎక్కువగా స్వపక్షంలోనే ఆశావాహులే కలవరపెడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి (Seri Subhash Reddy) ఎప్పటి నుంచో మెదక్ సీటుపై కన్నేశారు. మధ్యలో కొద్దిరోజులు సైలెంట్ అయిపోయిన శేరి.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు.

Mynampally Rohith

Mynampally Rohith

మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ (Mynampally Rohith) కూడా మెదక్ సీటును ఆశిస్తున్నారు. గతంలో ఇక్కడి నుండి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో అప్పటి టీడీపీ కేడర్, ఇప్పటి బీఆర్‌ఎస్ కేడర్లోనూ మైనంపల్లికి మంచి సంబంధాలే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూ మైనంపల్లి రోహిత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఓ వైపు సీనియర్ నేత.. మరోవైపు యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు మెదక్ బరిలో చివరకు ఎవరుంటారనేది సందిగ్ధంగా మారింది. ఏది ఏమైనా తానే బీఆర్‌ఎస్ అభ్యర్థినని చెబుతున్నారు సుభాష్‌రెడ్డి.

Thirupathi Reddy Kantareddy

Thirupathi Reddy Kantareddy

ఇక మెదక్‌లో అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ కూడా బలంగానే కన్పిస్తున్నాయి. బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఫ్లెక్సీలకే పరిమితమైన నాయకులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈసారి చౌదరి సుప్రభాతరావు (Suprabhath Rao Chowdary) బరిలో నిలిచే అవకాశం కన్పిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి (Thirupathi Reddy Kantareddy) పార్టీపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులు తనకున్నాయని, గతంలో మా పార్టీ క్యాండిడేట్ సరిగా లేకనే బీఆర్‌ఎస్‌ గెలిచిందని ఈసారి అలా కాదని సుప్రభాతరావు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనిపై అధిష్ఠానానికి సదాభిప్రాయం లేదని ఈసారి బరిలో ఉందేది తానేనంటూ తేల్చెచెప్పుతున్నారు సుప్రభాతరావు.

Also Read: ఆందోల్ కోటలో పాగా వేసేదెవరు.. ప్రధాన పార్టీల్లో పెరిగిపోతున్నఆశావాహులు!

ఇక బీజేపీలోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కవగానే కన్పిస్తున్నప్పటికీ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలకు దీటైన అభ్యర్థి కన్పించడం లేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ (Gaddam Srinivas), తాళ్ళపల్లి రాజశేఖర్లు ఈసారి పోటీపడుతున్నారు. అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో తెలియడం లేదు. మరోవైపు ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కకపోతే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు సైతం కాషాయదళం వైపు చూసే అవకాశాలు లేకపోలేదు.

Also Read: సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

మొత్తంగా చూసుకుంటే మెదక్ బరిలో ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో దిగుతారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అటు పద్మా దేవేందర్ రెడ్డి గానీ.. ఇటు రోహిత్ గానీ టిక్కెట్ దక్కకపోతే తమ దారి తాము చూసుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఆశావహుల్లోనూ టిక్కెట్ దక్కని వారు మరోపార్టీ వైపు చూసే అవకాశాలూ లేకపోలేదు. ఏదేమైనా హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలంటే సొంత పార్టీలో నేతలను దారికి తెచ్చుకోకతప్పని పరిస్థితిలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ.