nithiin – dil raju : హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. పోటీగా దిల్‌రాజు రెడీ!

నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్‌లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్‌తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.

nithiin – dil raju : హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. పోటీగా దిల్‌రాజు రెడీ!

dil raju, hero nithiin

dil raju- hero nithiin: జయం సినిమా (Jayam Movie)తో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ (Tollywood)లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న నితిన్.. తన రెండో సినిమా దిల్‌తో నిర్మాతగా రమణారెడ్డి.. అలియాస్ దిల్‌రాజుతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌గా పేరొందిన ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారనున్నారా? తెలంగాణ (Telangana) లోని ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారా? ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ పొలిటికల్ సినిమాలో ఎవరి పాత్ర ఏంటి? ఎక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?

నిజామాబాద్ పార్లమెంట్ సీటు (Nizamabad parliament seat) హాట్ హాట్‌గా మారుతోంది. గతంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు నుంచి మళ్లీ ఆమె పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో టిక్కెట్ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ ఉంది. ఇక ప్రతిపక్షాల్లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎంపీగా ఉండగా, కాంగ్రెస్ నుంచి ఈ సారి సినీ హీరో నితిన్‌ను బరిలోకి దింపాలని చూస్తున్నారు హస్తం నేతలు. నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నితిన్ ఫ్యామిలీలో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని సమాచారంతో బీఆర్‌ఎస్, బీజేపీ కూడా అలర్ట్ అయ్యాయని చెబుతున్నారు. నితిన్ మేనమామ పీసీసీ కార్యదర్శ నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఐతే ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో నగేశ్‌రెడ్డికి కానీ, ఆయన మేనల్లుడు హీరో నితిన్‌ను గాని పార్లమెంట్‌కు పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్.

నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్‌లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్‌తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. తర్వలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో నితిన్ భేటీ కానున్నారని.. ఆ తర్వాత ఈ విషయమై ఏదో ఒకటి తేలిపోనుందని చెబుతున్నారు. ఈ ప్రచారంతో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ కూడా సరైన అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి.

Also Read: కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరనేది ఎప్పట్లోగా తేలనుంది.. గులాబీబాస్ వైఖరి ఏంటో?

నితిన్ పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజును బరిలో దింపాలని చూస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. దిల్ రాజుకు రెండు పార్టీలతోనూ మంచి సంబంధాలే ఉండటంతో ఆయన ఎవరి ప్రతిపాదనకు ఒకే చెబుతారో.. లేక పోటీ చేయలేనంటూ సారీ చెబుతారో కాని.. జిల్లాలో ప్రస్తుతం ఇదో హాట్‌టాపిక్‌గా మారింది. నితిన్, దిల్ రాజు ఇద్దరూ ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతోపాటు ఆర్థికంగా ఒకరినొకరు తట్టుకునే శక్తి కూడా ఉంటుందని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

Also Read: కాంగ్రెస్ కు కౌంటర్ గా కిషన్ రెడ్డి వ్యూహాలు.. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

దిల్ రాజు సినీ నిర్మాతగా కాకుండా డిస్టిబ్యూటర్‌గా నైజాం ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర తెలంగాణలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంగ, అర్థ బలాల్లో నితిన్ కుటుంబాన్ని తట్టుకోవడం ఒక్క దిల్ రాజుకే సాధ్యమన్న టాక్ కూడా ఉంది. దీంతో ఆయనను ఎలాగైనా పోటీకి ఒప్పించాలని చూస్తున్నాయి బీఆర్‌ఎస్, బీజేపీ. ఐతే దిల్‌రాజు మాత్రం ఏ ప్రతిపాదనకూ ఇంతవరకు ఓకే చెప్పలేదని చెబుతున్నారు. ఒకవేళ పోటీ చేయాల్సిన పరిస్థితే వస్తే.. అధికార బీఆర్‌ఎస్ నుంచి ఆయన నిజామాబాద్ బరిలో నిలవడం ఖాయమని దిల్‌రాజు సన్నిహితుల సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుండటంతో జిల్లాలో ఈ సీటుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.