Hyderabad: ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్.. అందుకే భారీ డిమాండ్

భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

Hyderabad: ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్.. అందుకే భారీ డిమాండ్

India office space leasing

Hyderabad – office space leasing : హైదరాబాద్ నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలోనే కాదు లీజింగ్‌లోను భాగ్యనగరం తగ్గేదేలే అంటోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో (Metro Cities) పోలిస్తే ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ తన మార్క్ చూపుతోంది. గత మూడు నెలల్లో 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ లీజింగ్ కార్యకలాపాలతో హైదరాబాద్ తన బ్రాండ్‌ను సుస్థిరం చేసుకుంది.

హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లోను మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ రియల్ రంగ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూకుడు కనబరుస్తోందని సీబీఆర్‌ఈ వెలువరించిన ఇండియా ఆఫీస్‌ ఫిగర్స్‌ క్యూ 2 -2023 నివేదిక చెబుతోంది.

భారీ విస్తీర్ణం కలిగిన కార్యాలయాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌
భారీ విస్తీర్ణం కలిగిన కార్యాలయాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. సీబీఆర్ఈ నివేదిక ప్రకారం 50 వేల నుంచి లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ల లావాదేవీల్లో హైదరాబాద్, పూణె, బెంగళూరు టాప్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో దేశంలో 12.3 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ లీజింగ్ నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల వాటా 84 శాతంగా ఉంది. హైదరాబాద్, పూణె, బెంగళూరులో లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలాలకు అత్యధిక డిమాండ్‌ ఉంది.

Also Read: కోకాపేట్ భూముల వేలంతో సత్తా చాటిన హైదరాబాద్ రియల్ బ్రాండ్.. అక్కడ కూడా పెరగనున్న ధరలు!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో దేశీయ, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాల ఏర్పాటు వేగం పెరిగింది. ప్రస్తుతం వేల నుంచి మొదలు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా మరిన్ని సంస్థల పెట్టుబడి, విస్తరణ ప్రకటనలతో కార్యాలయ స్థలాల లీజింగ్‌ పరంగా హైదరాబాద్‌లో సానుకూలత నెలకొంది. ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసికంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ కార్యకలాపాలు జరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Also Read: ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విజ్ఞప్తి

ఇక హైదరాబాద్‌లోని ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాల్లో టెక్నాలజీ సంస్థలు 44 శాతం, ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్లు 25 శాతం స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కార్యాలయాల వాటా 8 శాతంగా ఉందని సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా పోలిస్తే మన దగ్గర అద్దెలు తక్కువగా ఉండటంతో మన దేశం గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లకు గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కంపెనీలు ప్రారంభమవ్వగా, మరికొన్ని వచ్చే అవకాశం ఉంది.