Butchaiah Chowdary: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బుచ్చయ్యకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. రాజకీయ చాణుక్యుడిగా.. తలపండిన నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్యకే తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.

Butchaiah Chowdary: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

gorantla butchaiah chowdary

Gorantla Butchaiah Chowdary: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందా? గత ఎన్నికల్లో టీడీపీ (TDP) గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో బుచ్చయ్యచౌదరి ఒకరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari District) రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన బుచ్చయ్యచౌదరి.. టీడీపీలో క్రియాశీల నేత. వయసు పైబడుతున్నా.. తన మనసు ఇంకా స్ట్రాంగ్‌గా ఉందంటున్న బుచ్చయ్య వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే.. ఆయన సిట్టింగ్ స్థానం.. పొత్తుల్లో గల్లంతయ్యేలా కనిపిస్తోంది. జనసేనతో (Janasena) పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా? తన పాత స్థానం సిటీకి మారతారా? అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని పరిస్థితి ఏంటి? రాజమండి టీడీపీలో కాకరేపుతున్న తెరవెనుక రాజకీయం ఇప్పుడు చూద్దాం.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ రాజకీయాల్లో మంచి వాక్ చాతుర్యం ఉన్న నేత. అధికార పార్టీ విమర్శలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టే సమర్థవంతమైన నాయకుడు. సీనియర్ ఎమ్మెల్యేగా.. మంత్రిగా టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించారు బుచ్చయ్య చౌదరి.. గత రెండుసార్లు రాజమండ్రి రూరల్ స్థానం నుంచి గెలిచిన బుచ్చయ్య చౌదరి.. మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఐతే ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో ఆయన పోటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేతగా బుచ్చయ్యకు టిక్కెట్ తిరస్కరించే పరిస్థితి లేకపోయినా.. ఆయనను ఏ స్థానం నుంచి పోటీకి పెట్టాలో తేల్చుకోలేక టీడీపీ అధిష్టానం జుత్తు పీక్కుంటుందని అంటున్నారు.

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య గత రెండు సార్లు రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా.. జనసేనతో పొత్తు కుదిరితే ఆ స్థానం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నుంచి పోటీకి జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ (Kandula Durgesh) ఆసక్తి చూపుతున్నారు. బుచ్చయ్య ఐతే జిల్లాలో ఎక్కడి నుంచైనా గెలిచే అవకాశం ఉన్నందున రూరల్ తమ పార్టీకి విడిచిపెట్టాలని జనసేన కోరుతోందట.. ఈ పొత్తు ప్రతిపాదనలు తన సీటుకే ఎసరు పెడుతున్న విషయం గ్రహించిన కొద్ది కాలం క్రితం రాజమండ్రి సిటీకి మారిపోడానికి నిర్ణయం తీసుకున్నారు.

Also Read: 2024 ఎన్నికల్లో తమ్ముడి కోసం చిరంజీవి రణరంగంలోకి దిగనున్నారా?

తన సొంత స్థానమైన అక్కడికి మారితే ప్రయాస లేకుండా విజయం సాధించొచ్చని భావించారట.. ఇంతలో అక్కడి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబంపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతో.. వారికి సానుభూతి పెరిగి మరింత స్ట్రాంగ్ అయ్యారని అంటున్నారు. ఈ విషయం కూడా గమనించిన బుచ్చయ్య సిటీపై ఆశలు వదులుకుని పక్కనే ఉన్న రాజానగరం వెళ్లిపోడానికి సిద్ధమయ్యారట.. ఇంతలో అక్కడ పెద్దాపురం నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అడ్డుగా నిలిచారని చెబుతున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన రాజప్పకు లైన్ క్లియర్ చేయడానికి బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది టీడీపీ. ఆయన కూడా ఆ నియోజకవర్గంలో గట్టిగా పనిచేసుకుంటుండటం.. ఇటీవల జరిగిన చంద్రబాబు సభను సక్సెస్ చేయడంతో బుచ్చయ్యచౌదరి పరిస్థితి డోలాయమానంలో పడిందంటున్నారు.

Also Read: తిరుపతి బరిలో వైసీపీ కొత్త అభ్యర్థి.. తెరపైకి డాక్టర్ శిరీష పేరు!?

టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బుచ్చయ్యకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. రాజకీయ చాణుక్యుడిగా… తలపండిన నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్యకే తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు. పార్టీకి వీరవిధేయుడైన బుచ్చయ్యను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందని అంటున్నారు. బుచ్చయ్యచౌదరి ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని జనసేనకే నచ్చజెప్పి.. దుర్గేశ్‌ను ఎమ్మెల్సీ చేసి బుచ్చయ్యను రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగిస్తారా? లేక రాజమండ్రి ఎంపీగా బరిలో దింపుతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో సిటీ సీటు నుంచి బుచ్చయ్య పేరు పరిశీలిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఏ ప్రత్యామ్నాయం ఎంచుకుంటారో గాని.. బుచ్చయ్యకు ఎలా సర్దుబాటు చేస్తారో.. టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందోనన్న అంశమే ఆసక్తికరంగా మారింది.