CM KCR : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం నాపై జరిగినట్లు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. CM KCR

CM KCR : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

CM KCR On Kotha Prabhakar Reddy Incident

CM KCR On Kotha Prabhakar Reddy Incident : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. చేతగాని దద్దమ్మలు, చేతకాని వెధవలు ప్రతిపక్ష పార్టీలు కొత్త ప్రభాకర్ పై కత్తిపోట్లకు ఒడిగట్టారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఈ దాడి అరాచకం, దుర్మార్గం అన్నారు. గెలిపిస్తే పని చేయాలి గాని గుండాయిజం చేయొద్దని హెచ్చరించారు. ఇది కేసీఆర్ పై దాడిగా భావిస్తామన్నారు. హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మా సహనాన్ని పరీక్షించొద్దు అని వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్. శత్రువులను కూడా మనం ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో ఎప్పుడూ హింస జరగలేదు..
”తెలంగాణ ఎన్నికల సమయంలో ఎప్పుడూ హింస జరగలేదు. ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం నాపై జరిగినట్లు. తొలిసారి ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. సభలను రద్దు చేసుకుని వెళ్దామనుకున్నా. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని హరీశ్ రావు చెప్పడంతో ఆగిపోయా. పని చేసే వాళ్లపై హత్యా రాజకీయాలు చేయొద్దు” అని కేసీఆర్ హితవు పలికారు.

Also Read : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు

గెలవడం చేత కాక దాడులు..
గెలవడం చేత కాని దద్దమ్మలు, వెధవలు కత్తులతో దాడులకు పూనుకుంటున్నారు అని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు కేసీఆర్. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురయ్యారని, మంత్రి హరీశ్ రావు దగ్గరుండి చూసుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. దాడులను తిప్పికొట్టాలంటే ఓటుతోనే బద్ది చెప్పాలన్నారు కేసీఆర్. ”జుక్కల్ లో ఉన్నప్పుడు దాడి వార్త గురించి నాకు తెలిసింది. వెంటనే వెళ్లిపోదామని అనుకున్నా. అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేవుడి దయ వల్ల ప్రభాకర్ రెడ్డికి అపాయం తప్పింది” అని కేసీఆర్ అన్నారు.

కామారెడ్డి బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించామన్నారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్ళీ పెద్ద హోదాలో ఉంటారని చెప్పారు. ముస్లిం మైనార్టీల కోసం 200 స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్.

యశోదా ఆసుపత్రికి కేసీఆర్..
మరోవైపు కాసేపట్లో యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ ను కేసీఆర్ పరామర్శించనున్నారు. నారాయణఖేడ్ నుంచి నేరుగా ఆసుపత్రికి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యక్తిగత భద్రత సిబ్బంది యశోదా హాస్పిటల్ కు చేరుకుంది. పోలీసుల యశోదా ఆసుపత్రి పరిసరాలను తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు.

Also Read : కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరింపులు.. తగిన మూల్యం చెల్లించక తప్పదు : రేవంత్ రెడ్డి