Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ

దేశంలో మరోసారి ఉల్లిపాయల ధర మరోసారి పెరిగింది. వంటిళ్లలో ఎక్కువగా వినియోగించే ఉల్లి ధరలు ఆకాశన్నంటడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.....

Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ

Onion

Onion Prices : దేశంలో మరోసారి ఉల్లిపాయల ధర మరోసారి పెరిగింది. వంటిళ్లలో ఎక్కువగా వినియోగించే ఉల్లి ధరలు ఆకాశన్నంటడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కిలో ఉల్లి ధర వంద రూపాయలు పలుకుతోంది. నవంబర్ నెలలో ఉల్లి ధరలు కిలోకు 150 రూపాయలకు పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఉల్లి ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులకు కారణాలేమిటో తెలిస్తే షాకవుతారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల కలవరం

దేశంలోని తెలంగాణతో పాటు అయిదు ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఉల్లి ధరలు పెరుగుతోండటంపై పాలక పార్టీ నేతలు కలవరపడుతున్నారు. మరో వైపు పెరుగుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రంగంలోకి దిగింది. ఉల్లిపాయలకు ఏడాదితో రెండు సీజన్లు ఉంటాయి. మార్చి- ఏప్రిల్ నెలల్లో ఉల్లి ధరలు అయిదేళ్ల కనిష్ఠానికి చేరాయి.

ఉల్లి రవాణాకు అధిక వ్యయం

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలో ఒక రైతు 472 కిలోల ఉల్లిని విక్రయించగా కేవలం 495రూపాయలే వచ్చాయి. 472 కిలోల ఉల్లిని మార్కెట్ కు రవాణ చేయడానికి రైతు 590 రూపాయలు వెచ్చించాడు. అంటే రైతుకు దక్కిన ధర కంటే ఉల్లి రవాణాకే అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చింది. మరో రైతు ఉల్లిని విక్రయిస్తే ఆయనకు కేవలం రెండు అంటే రెండు రూపాయల చెక్కు రావడం గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నవంబర్‌లో మరింత పెరగనున్న ఉల్లి ధరలు

గిట్టుబాటు ధర రాకపోవడంతో మొదటి ఉల్లి సీజన్ లో రైతులకు కష్టాలు తప్పలేదు. ప్రస్థుతం ఉల్లి రెండో సీజన్ ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం కిలో ఉల్లిని 5 నుంచి 10 రూపాయలకు విక్రయించారు. ప్రస్థుతం ఉల్లి కిలో ధర 70 రూపాయల నుంచి వందరూపాయల దాకా పలుకుతుంది. నవంబర్ నెలలో కిలో ఉల్లి ధర 150రూపాయలకు చేరుతుందని చెబుతున్నారు.

ఉల్లి ధర రెట్టింపు పెంపు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఉల్లి ధరలు రెట్టింపు అయ్యాయి. ఉల్లి మార్కెట్‌లోని వ్యాపారులు ముందుగా ధరలు పెరిగాయని చెబుతున్నారు. అయితే నవరాత్రుల కారణంగా ఉల్లి డిమాండ్ తగ్గింది. నవరాత్రి తరువాత ఉల్లిపాయల వినియోగం వేగంగా పెరిగింది. ధర పెరగడంతో పండుగ తర్వాత కూడా ప్రజలు ఉల్లికి దూరంగా ఉంటున్నారు.

పెరిగిన డిమాండ్

మార్కెట్‌లో ఉల్లి కొరత, డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. కానీ ఉల్లి సాగులో ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఉల్లి కొరత కొనసాగుతోంది.

ఉల్లి కొరతకు కారణం ఏమిటి?

భారతదేశంలో ఉల్లిని రెండు సీజన్లలో పండిస్తారు. రబీ సీజన్‌లో విత్తనాలను నవంబర్-డిసెంబర్‌లో వేస్తారు. ఏప్రిల్‌లో ఉల్లి పంట చేతికి వస్తుంది. రెండవ ఖరీఫ్ సీజన్ రెండు దశల్లో ఉంటుంది. జూన్-జూలై,సెప్టెంబర్-అక్టోబర్. రెండవ దశలో రైతులు తక్కువ ఉల్లిని పండించారు. ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడంతో తగిన సప్లయి లేక డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్‌లో ఉల్లి ధరలు తక్కువగా ఉండడంతో రైతులు ఉల్లి సాగును తగ్గించడమే ఇందుకు కారణమని రైతులు చెప్పారు.

అధిక లాభాల కోసం ఉల్లి ఎగుమతి

అయితే ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ, దేశంలో రైతులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల టన్నుల ఉల్లిని అధికంగా పండించారు. ఈ మిగులు ఉల్లిని వ్యాపారులు అధిక లాభాల కోసం విదేశాలకు ఎగుమతి చేశారు. దీంతో ఆగస్టులో ఉల్లి ధరలు పెరగడం ప్రారంభించాయి. ఉల్లి ఎగుమతులను నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వం దీనిపై 40శాతం వరకు ఎగుమతి పన్ను విధించింది.

Also Read : German tattoo artist Shani Louk : హమాస్ మరో దారుణం…జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే…

గతంలో ఎగుమతి పన్ను అమలులో లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పెద్దగా ప్రభావం చూపించ లేదు. దీంతో మళ్లీ ఉల్లి ధరల పెంపుతో ఘాటు పరిస్థితి ఏర్పడింది. సాధ్యమైన మార్గాల ద్వారా ఉల్లి ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read : Police Arrest : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో డ్రగ్స్ విక్రేత ఏం చేశాడంటే…షాకింగ్ సీన్

ఉల్లిపాయలను కోయకుండానే ధరల పెరుగుదలతో వినియోగదారుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో్ దిగి వస్తాయా? లేదా అనేది వేచి చూడాల్సిందే.