ODI World Cup 2023 : అఫ్గానిస్థాన్ కొంప‌ ముంచిన క్యాచ్‌.. లేదంటేనా..!

క్రికెట్‌లో ఓ నానుడి ఉంది. క్యాచెస్‌ విన్ మ్యాచెస్‌. అంటే క్యాచ్‌లు ప‌డితే మ్యాచులు గెల‌వ‌చ్చు అని అర్థం.

ODI World Cup 2023 : అఫ్గానిస్థాన్ కొంప‌ ముంచిన క్యాచ్‌.. లేదంటేనా..!

Mujeeb dropped Glenn Maxwell catch

ODI World Cup : క్రికెట్‌లో ఓ నానుడి ఉంది. క్యాచెస్‌ విన్ మ్యాచెస్‌. అంటే క్యాచ్‌లు ప‌డితే మ్యాచులు గెల‌వ‌చ్చు అని అర్థం. మ్యాచ్‌లో ఒక్క క్యాచ్ చేజారినా దాని ప్ర‌భావం మ్యాచ్ ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుక‌నే ఒక్కక్యాచ్ ను కూడా మిస్ చేయ‌కూడ‌ద‌ని అంటారు. ఈ విష‌యం అఫ్గానిస్థాన్ జ‌ట్టుకు అనుభ‌వ పూర్వ‌కంగా తెలిసి వ‌చ్చింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు ఈ విష‌యం చాలా బాగా అర్థ‌మై ఉంటుంది.

చేజారిన క్యాచ్‌.. మాక్స్‌వెల్ మోత‌..

292 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా జ‌ట్టు బ‌రిలోకి దిగ‌గా 91 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో పాట్ క‌మిన్స్‌తో క‌లిసిన మాక్స్‌వెల్ జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. మాక్స్‌వెల్ వ్య‌క్తిగ‌త స్కోరు 33 ప‌రుగుల వ‌ద్ద నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఫీల్డ‌ర్ ముజీబ్ జార‌విడిచాడు. అప్ప‌టికే ఆస్ట్రేలియా స్కోరు ఏడు వికెట్ల న‌ష్టానికి 112 పరుగులు మాత్ర‌మే.

Also Read: టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేసిన బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ష‌కీబ్ ఔట్‌..

అప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రుగా ఆడిన మాక్స్‌వెల్ ఆ త‌రువాత రెచ్చిపోయాడు. త‌నకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఎడా పెడా బౌండ‌రీలు బాదుతూ చూస్తుండ‌గానే అర్ధ‌శ‌త‌కం, శ‌క‌తం, 150 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. క్రాంప్స్ వేధిస్తున్న‌ప్ప‌టికీ జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాల‌నే ల‌క్ష్యంతో మొండిప‌ట్టుద‌ల‌తో పోరాడాడు. 128 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసుకుని జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

ఒక‌వేళ మాక్స్ వెల్ 33 ప‌రుగుల వ‌ద్ద ఇచ్చిన క్యాచ్ గ‌నుక అఫ్గానిస్థాన్ ఫీల్డ‌ర్లు ప‌ట్టి ఉంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేదన్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క్యాచ్ మిస్ చేసిన త‌రువాత మాక్స్‌వెల్ 168 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read: పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 291 ప‌రుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం మాక్స్‌వెల్ విజృంభ‌ణతో ల‌క్ష్యాన్ని ఆసీస్ 46.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ చేసిన 24 ప‌రుగుల‌కే మాక్స్‌వెల్ త‌రువాత అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం.