DMDK Founder Vijayakanth passes away : విజయ్‌కాంత్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేశారు.. ఎన్నిసార్లు గెలుపొందారో తెలుసా?

సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ కాంత్.. రాజకీయ రంగంలో రాణించలేక పోయారు. డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లినప్పటికీ అధికారాన్ని చేపట్టలేక పోయారు.

DMDK Founder Vijayakanth passes away : విజయ్‌కాంత్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేశారు.. ఎన్నిసార్లు గెలుపొందారో తెలుసా?

Vijayakanth passes away

Vijayakanth passes away : ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ (71) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న తమిళనాడు మధురైలో జన్మించిన విజయకాంత్ .. 27 ఏళ్ల వయస్సులోనే సినీరంగంలోకి అడుగు పెట్టారు. కోలీవుడ్ లోనేకాక పలు భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న విజయ్ కాంత్.. రాజకీయాల్లో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్లినప్పటికీ.. అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండటమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు.

 

తొలి ఎన్నిల్లోనే ఘోర పరాభవం..
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్‌కాంత్‌ రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2005లో మధురైలో డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన మరుసటి ఏడాది.. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో డీఎండీకే అభ్యర్థులను బరిలోకి దింపారు. కానీ, ఆ ఎన్నికల్లో డీఎండీకే పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం విజయ్‌కాంత్‌ ఒక్కరే అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు. అయితే, ఆ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి 8.33శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ విజయ్‌కాంత్‌ పార్టీకి పరాభవం తప్పలేదు. 40 పార్లమెంట్ స్థానాలకుగాను 39 స్థానాల్లో డీఎండీకే అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, ఒక్క సీటుకూడా గెలవలేదు.

 

జయలలిత పార్టీతో పొత్తు..
2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నాడీఎంకే తో విజయ్‌కాంత్‌ పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసి 29 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. కొద్దికాలంకే జయలలితతో విభేదాల కారణంగా అన్నాడీఎంకే నుంచి విడిపోయారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి డీఎంకే పార్టీ కంటే విజయకాంత్ డీఎండీకే పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంతో విజయ్‌కాంత్‌ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ తరువాత 2016, 2021 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. అయితే, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో విజయ్‌కాంత్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో డీఎండీకే 14 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎన్నికల సమయంలో ఎన్డీయే నేతల సమావేశంలో విజయ్‌కాంత్‌ పేరును ప్రస్తావించిన మోదీ… తన ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు.  2014 లోక్ సభ ఎన్నికలతోపాటు.. 2019 ఎన్నికల్లోనూ డీఎండీకే పార్టీ ఒక్కసీటును కూడా గెలుచుకోలేక పోయింది.

 

రెండు సార్లు విజయం..
విజయ్‌కాంత్‌ మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. డీఎండీకే పార్టీని స్థాపించిన తరువాత తొలిసారి జరిగిన 2006 ఎన్నికల్లో వృద్దాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 40.49 ఓట్లతో విజయం సాధించారు. 2011లో రుషివందియం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అక్కడకూడా విజయ్‌కాంత్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుందూర్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయ్‌కాంత్‌.. ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన అనారోగ్యం కారణాలతో పోటీ చేయలేదు.