బ్ల‌డ్ క్యాన్స‌ర్‌కు కొత్త ఇమ్యునోథెర‌పీ… కార్‌-టి సెల్ థెర‌పీ!

క్యాన్స‌ర్ రోగులకు ముఖ్యంగా బ్ల‌డ్ క్యాన్స‌ర్ రోగుల పాలిట వ‌రం ఈ కార్‌-టి సెల్ థెర‌పీ. ర‌క్తంలో క్యాన్స‌ర్ రావ‌డం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయే ప‌రిస్థితిలో ఉన్న పేషెంట్ల‌ను కూడా ఈ చికిత్స ద్వారా బాగుచేయ‌వ‌చ్చు.

బ్ల‌డ్ క్యాన్స‌ర్‌కు కొత్త ఇమ్యునోథెర‌పీ… కార్‌-టి సెల్ థెర‌పీ!

CAR-T therapy

CAR-T therapy: క్యాన్స‌ర్ చికిత్స‌ల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పును తీసుకువ‌చ్చిన చికిత్స ఇమ్యునోథెర‌పీ. మ‌న శ‌రీరంలోని వ్యాధి నిరోధ‌క క‌ణాల‌నే క్యాన్స‌ర్ క‌ణాల‌ను మ‌ట్టుబెట్టే ఆయుధాలుగా రూపొందించ‌డ‌మే ఇమ్యునోథెర‌పీలోని మూల సూత్రం. ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ ర‌కాల బ్ల‌డ్ క్యాన్స‌ర్లు, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వంటి వాటిలో ఇది మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ది. ఇప్పుడు ఇమ్యునోథెర‌పీలో కూడా కార్‌-టి సెల్ థెర‌పీ అనే ఆధునిక చికిత్స అందుబాటులోకి వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట‌మొద‌టిసారిగా ఈ చికిత్స హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో విజ‌య‌వంతం అయింది.

మ‌ల్టిపుల్ మైలోమా అనే ఒక ర‌క‌మైన బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న పేషెంటులో ఈ కార్‌-టి సెల్ థెర‌పీ స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింది. క‌రీంన‌గ‌ర్ కు చెందిన 50 ఏళ్ల మ‌హిళ‌కు ఈ అత్యాధునిక చికిత్స ద్వారా కొత్త ఊపిరి పోశారు.

కార్‌-టి సెల్ థెర‌పీ అంటే..?
కార్‌-టి సెల్ థెర‌పీల‌ను సాధార‌ణంగా ‘లివింగ్ డ్రగ్స్’ అని పిలుస్తుంటారు. మ‌న ర‌క్తంలోని తెల్ల ర‌క్త క‌ణాల్లోని ముఖ్య‌మైన క‌ణాల్లో టి-సెల్స్ ఒక‌టి. ఇవి కూడా వ్యాధి నిరోధ‌క క‌ణాలే. ఆఫెరిసిస్ అనే ప్ర‌క్రియ ద్వారా ముందుగా పేషెంటులోని టి- క‌ణాల‌ను వేరుచేస్తారు. ఆ త‌ర్వాత వీటిని వైర‌స్ జ‌న్యుప‌దార్థం ద్వారా (వైర‌ల్ వెక్టార్‌) జ‌న్యుప‌ర‌మైన మార్పుల‌కు లోనుచేస్తారు. ఇదంతా కూడా ప్ర‌యోగ‌శాల‌లోనే జ‌రుగుతుంది. ఇలా జ‌న్యుమార్పుల‌కు గురైన టి-క‌ణాల ఉప‌రిత‌లం మీద కైమెరిక్ యాంటిజెన్ రీసెప్టార్లను (సిఎఆర్‌- కార్‌) క‌లిగివుంటాయి. ఈ రీసెప్టార్లు క్యాన్స‌ర్ క‌ణాల‌పై ఉన్న అబ్‌నార్మ‌ల్ ప్రొటీన్‌ను గుర్తిస్తాయి. ఇప్పుడు ఇలా కైమెరిక్ యాంటిజెన్ రీసెప్టార్ (కార్‌)ను క‌లిగివున్న టి-క‌ణాల‌ను అవ‌స‌ర‌మైన మోతాదు వ‌ర‌కు అభివృద్ధి చేస్తారు. ఈ కార్ టి- కణాల‌ను క్యాన్స‌ర్ క‌ణాల‌ను ఎదుర్కొనేందుకు ఉప‌యోగిస్తారు. ఈ చికిత్సా ప‌ద్ధ‌తినే కార్‌-టి సెల్ థెర‌పీ అంటారు.

క్యాన్స‌ర్ రోగులకు ముఖ్యంగా బ్ల‌డ్ క్యాన్స‌ర్ రోగుల పాలిట వ‌రం ఈ కార్‌-టి సెల్ థెర‌పీ. ర‌క్తంలో క్యాన్స‌ర్ రావ‌డం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయే ప‌రిస్థితిలో ఉన్న పేషెంట్ల‌ను కూడా ఈ చికిత్స ద్వారా బాగుచేయ‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమార 25 వేల మంది ఈ కార్‌-టి సెల్ థెర‌పీ ద్వారా ప‌లు ర‌కాల బ్ల‌డ్ క్యాన్స‌ర్ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌న ఇండియాలో కూడా ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వ‌స్తున్న‌ది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అపోలోలో విజ‌య‌వంతం అయింది. కార్‌-టి సెల్ థెర‌పీ ద్వారా బి-సెల్ లింఫోమాస్‌, లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, మైలోమాస్ లాంటి బ్లడ్ క్యాన్స‌ర్ల‌కు మంచి చికిత్స‌ను అందించ‌వ‌చ్చు.

Padmaja Lokireddy
– డాక్ట‌ర్ ప‌ద్మ‌జ లోకిరెడ్డి

హెమ‌టాల‌జిస్ట్ అండ్ బిఎంటి స్పెష‌లిస్ట్‌
అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌, హైద‌రాబాద్‌.