DrSeediri Appala Raju Vs Gouthu Sireesha : పలాసలో ఉత్కంఠ పోరు.. ఆ అరుదైన అవకాశం ఈ ఇద్దరిలో దక్కేది ఎవరికి?

మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

DrSeediri Appala Raju Vs Gouthu Sireesha : పలాసలో ఉత్కంఠ పోరు.. ఆ అరుదైన అవకాశం ఈ ఇద్దరిలో దక్కేది ఎవరికి?

DrSeediri Appala Raju Vs Gouthu Sireesha

DrSeediri Appala Raju Vs Gouthu Sireesha : సిక్కోలు జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తైతే.. పలాస సెగ్మెంట్ పాలిటిక్స్ మరో ఎత్తు. ఢీ అంటే ఢీ.. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో ఇక్కడి రాజకీయం నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా పలాస రాజకీయాలు నడుస్తున్నాయి. మాటకు మాట.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం సలసల మండుతోంది.. మరి ఈ వాడీవేడి పాలిటిక్స్‌లో పైచేయి సాధించేదెవరు? పాత ప్రత్యర్థులు మధ్య జరుగుతున్న సరికొత్త పోరులో విజేత ఎవరు?

తొలి పోటీలో గెలుపు అప్పలరాజుదే..
పలాస నియోజకవర్గంలో రాజకీయం హైటెన్షన్‌ పుట్టిస్తోంది. తెల్ల బంగారం జీడిపప్పునకు ప్రసిద్ధిగాంచింది పలాస. జీడిపప్పు పరిశ్రమల సైరన్‌తో దినచర్య ప్రారంభించే పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కార్మికులు, వ్యాపారులే ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలోనే వాణిజ్య కేంద్రమైన పలాసలో అధికార వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు, టీడీపీ మహిళా నేత గౌతు శిరీష మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి తలపడిన ఈ ఇద్దరిలో మంత్రి అప్పలరాజుదే పైచేయి అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు… ఐదేళ్లుగా ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. మళ్లీ ఈ ఇద్దరే ఆయా పార్టీల అభ్యర్థులుగా తలపడుతున్నారు.

గౌతు కుటుంబం కంచుకోటను బద్దలుకొట్టిన సీదిరి..
2009 నియోజకవర్గాల పునర్విభజనలో పలాస అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. దీని పరిధిలో.. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలున్నాయి. మొత్తం 2 లక్షల 10 వేల ఓటర్లు ఉన్నారు. వీరిలో మత్స్యకార సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ. మత్స్యకారుల తర్వాత.. కళింగ, యాదవ సామాజికవర్గాల ఓట్లు ఎక్కవగా ఉన్నాయి. ఒకప్పుడు.. సర్దార్‌ గౌతు లచ్చన్న ఫ్యామిలీకి ఉద్దానంగా చెప్పే పలాస ప్రాంతం పొలిటికల్ అడ్డాగా ఉండేది. సోంపేట నుంచి గౌతు లచ్చన్న 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓ సారి మంత్రిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. గత ఎన్నికల్లో గౌతు శివాజీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని కుమార్తె గౌతు శిరీషను బరిలో దింపారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీదిరి అప్పలరాజు.. గౌతు కుటుంబం కంచుకోటను బద్దలుకొట్టారు.

అరుదైన అవకాశం వీరిద్దరిలో దక్కేదెవరికి?
పలాస నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా.. 2014లో తెలుగుదేశం, 2019లో వైసీపీ వేవ్‌లో సిదిరి అప్పలరాజు గెలిచారు. ఇప్పటివరకు ఏ పార్టీకి కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఐతే ఈ సారి ఆ రికార్డు బద్ధలుకొట్టే అవకాశం ఎవరికి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి అప్పలరాజు, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఎవరు గెలిచానా.. పలాసలో రెండోసారి తమ పార్టీని గెలిపించిన నేతగా రికార్డు సృష్టించడం ఖాయం. ఈ అరుదైన అవకాశం వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠగా మారింది.

తొలి విజయంతోనే కేబినెట్ లో చోటు..
గత ఎన్నికల్లో మంత్రి సిదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం జగన్‌ క్యాబినెట్ లో మంత్రిగా చాన్స్‌ కొట్టేశారు. మంత్రివర్గ విస్తరణలో సిదిరి పదవిని పదిలం చేసుకుని.. సీఎం జగన్‌ వద్ద తన పట్టు ఏ పాటిదో నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే ధీమాతో కనిపిస్తున్నారు మంత్రి అప్పలరాజు.

మంత్రికి తలనొప్పిగా గ్రూపు పాలిటిక్స్..
దశాబ్దాలుగా వెనుకబడిన పలాసను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించానంటున్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. పలాసకి డిగ్రీ, జూనియర్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్లతో ఉద్దానం మంచి నీటి పథకం తన హయాంలోనే నిర్మితమయ్యాయని చెబుతున్నారు మంత్రి. అయితే వైసీపీలో గ్రూపు పాలిటిక్స్‌ సిదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో మంత్రి విజయానికి కృషి చేసిన కొద్దిమంది నేతలు ఇప్పుడు పార్టీని వీడటం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సివుంది.

గెలుపే లక్ష్యంగా గౌతు శిరీష పావులు..
ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతు శిరీష అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో దూకుడుగా పనిచేస్తున్నారు. మంత్రిని ఎదుర్కోవడంలో మడమతిప్పని పోరాటం చేస్తున్నారు శిరీష. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శిరీష ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో గౌతు కుటుంబానికి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. గత తప్పిదాలను పునరావృతం కానివ్వకుండా చూసుకుంటున్న శిరీష.. వైసీపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకుని స్పీడ్‌ చూపుతున్నారు. ప్రశాంతమైన పలాసలో రాజకీయ ఉద్రిక్తతలు పెంచేస్తున్నారని.. తాను గెలిచి పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తానని చెబుతున్నారు శిరీష.

ఇలా ఇద్దరి మధ్య రాజకీయం హీట్‌ పుట్టిస్తుండగా, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ రచనలో రెండు పార్టీలు బిజీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇద్దరి అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ప్రచారం మొదలుపెట్టారు. మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు… టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : గుడివాడ వర్సెస్ పల్లా.. గాజువాకలో గెలుపెవరిది?