మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కుట్రకోణం ఉంది, ఎంతటి వారున్నా వదిలేది లేదు- మంత్రి సత్యప్రసాద్

కెమికల్ వినియోగించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు కూడా ఉన్నాయి.

మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కుట్రకోణం ఉంది, ఎంతటి వారున్నా వదిలేది లేదు- మంత్రి సత్యప్రసాద్

Minister Anagani Satya Prasad : మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కుట్రకోణం దాగి ఉందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారాయన. మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, కచ్చితంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు మంత్రి సత్యప్రసాద్.

రిజిస్ట్రేషన్స్, భూ సర్వే మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుండి ఎక్కువ వినతులు భూ వివాదాల మీదే వస్తున్నాయని, 80 శాతం భూ వివాదాలే అని చెప్పారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలన్నారు. మదనపల్లి ఘటనలో రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో అధికారులు బందీలుగా మారారని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి వెళ్తే వందల సంఖ్యలో
వినతులు ఇచ్చారని వెల్లడించారు.

”అసైన్డ్ ల్యాండ్స్ లో జరిగిన అవకతవకలు, 22-A భూములపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సమగ్ర భూ సర్వే పేరుతో సర్వే రాళ్ళపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ముఖ్యమంత్రి జగన్.. ఫోటో పిచ్చితో తన ఫొటోలు పెట్టుకున్నారు. సర్వే రాళ్లపై జగన్ ఫోటో తీయాలంటే రూ.12 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజాధనం నిరూపయోగం కాకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. గత పాలకుల భూదాహం కారణంగా వేల మంది బాధితులుగా మారారు.

13 జిల్లాల్లో బాధితుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాట్లు చేస్తాం. రీ సర్వే కోసం గ్రామ సభలు పెడతాం. మదనపల్లి ఫైల్స్ కేసులో కచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది. ఈ కేసులో పెద్దిరెడ్డి ఉన్నా వదిలి పెట్టేది లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎంతమంది ఉన్నా వదిలిపెట్టేది
లేదు. విశాఖలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయి. అక్కడ భారీగా భూ బాధితులు ఉన్నారు. విశాఖ భూ కుంభకోణాల మీద త్వరలోనే విచారణ చేస్తాం. కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాలపై QR కోడ్ తీసుకొస్తాం. పట్టదారు పాస్ పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో త్వరలోనే పాస్ బుక్ లు రైతులకు అందజేస్తాం.

విశాఖ శారదా పీఠానికి ఇష్టం వచ్చినట్లు తక్కువ ధరలకు భూములు ఇచ్చారు. రూ.22 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.15 లక్షలకే ఇచ్చారు. జగన్ తాను నమ్మిన స్వామికి తన సొంత నిధులతో కొనివ్వాలి కానీ ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఇస్తారు?” అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

కెమికల్ వినియోగించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు- సిసోడియా, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మదనపల్లి ఘటనలో కుట్రకోణం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. కెమికల్ వినియోగించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. కొన్ని తప్పుడు పత్రాలు ఉన్నాయి. ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు కుడా ఉన్నాయి. అక్కడ అధికారులు కూడా మేము సంతకాలు పెట్టలేదని చెబుతున్నారు. మా సంతకాలు ఫోర్జరీ జరిగాయని అధికారులు చెబుతున్నారు.

ఫైల్స్ దగ్ధం కేసు.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. గత ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది.. అద్దంలో కూడా ఆయనే కనిపిస్తున్నారు: జగన్‌పై షర్మిల ఫైర్