ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?

60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి... స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని... ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు.

ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?

Gossip Garage : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్‌.. నీడలా వెంటాడుతున్న మూడు పోలీసు బృందాలు…. 60 రోజులుగా కనిపించని ఆచూకీ… కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అనుచరులపైనా నిఘా… వీరిలో ఏ ఒక్కరికి ఫోన్‌ చేసినా ఆ ఒక్కడు దొరికినట్లే… కథ సుఖాంతమైనట్లే… ఇటు పోలీసులు.. అటు అధికార పార్టీ నేతలు గాలిస్తున్నా… ఆ ఒక్కడి అడ్రస్‌ మాత్రం తెలియడం లేదు. అసలు దేశంలోనే ఉన్నాడా? దేశం విడిచి వెళ్లాడా? అనే సందేహాలు ఒకవైపు… పోలీసులు ఇంత సీరియస్‌గా తీసుకున్న కేసులో వెతుకుతున్నది ఓ మాజీ ప్రతినిధి కోసం…. ఇప్పటికే ఆ నేత ఎవరో అర్థమై ఉంటుంది…. అతడే మోస్ట్‌ వాంటెడ్‌ పొలిటీషియన్‌! వల్లభనేని వంశీ….

60 రోజులుగా ఆచూకీ లేని వంశీ..
వల్లభనేని వంశీ… గన్నవరం మాజీ ఎమ్మెల్యే… ఏపీలో మోస్ట్‌ వాంటెడ్‌ పొలిటీషియన్‌… 60 రోజులుగా ఎక్కడున్నారో తెలియదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 18 మంది అరెస్ట్ అయ్యారు. వీరంతా వంశీ అనుచరులే… కొందరు బెయిల్‌పై బటయకు వస్తే… మరికొందరు గన్నవరం సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ కేసులో 71వ నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను నియమించి మరీ జల్లెడ పడుతున్నారు.

60 రోజులుగా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్‌గా గాలిస్తోంది?
ప్రభుత్వం, పోలీసులు ఇంత తీవ్రంగా గాలించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ కేసులో వంశీ అరెస్టు అయితే వెంటనే బెయిల్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నాయి న్యాయవాద వర్గాలు. కానీ, ప్రభుత్వం వంశీని అంత తేలిగ్గా విడిచిపెడుతుందా? అనేదే సందేహం. సరిగ్గా ఈ అనుమానంతోనే వంశీ కూడా తన అడ్రస్‌ తెలియకుండా అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారంటున్నారు. ఐతే 60 రోజులుగా వంశీ కదలికలపై పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్‌గా గాలిస్తోంది? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతోపాటు ఇంకేమైనా కేసులు పెండింగ్‌లో ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వంశీని అరెస్టు చేయడమే లక్ష్యం..
టీడీపీలో సగటు కార్యకర్త కూడా వంశీని అరెస్టు చేయాలని కోరుకుంటుండమే… మాజీ ఎమ్మెల్యేకు ముప్పుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి… స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని… ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు. కానీ, వంశీని అరెస్టు చేయకపోతే…. తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతో తక్షణం వంశీని పట్టుకోవాల్సిందిగా హైకమాండ్‌ పోలీసులను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వంశీని అరెస్టు చేసి ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి టార్గెట్‌ అయిన వంశీని అరెస్టు చేయడమే తమ లక్ష్యంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై రేయింబవళ్లు వర్క్‌ చేస్తున్నారని టాక్‌.

అనుచరుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా షెల్టర్‌..
ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత… వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో షాక్‌ తిన్న మాజీ ఎమ్మెల్యే వంశీ…. తనకు ఎదురయ్యే పరిస్థితిపై ముందుగానే ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అందుకే జూన్‌ 4న ఫలితాలు విడుదలైతే…. ఆ మరునాడే విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల దాడులు, పోలీసు కేసుల నుంచి తన అనుచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ షెల్టర్‌ ఏర్పాటు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు… వంశీకి కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన వ్యక్తులు హైదరాబాద్‌ షెల్టర్‌లోనే పట్టుబడినట్లు చెబుతున్నారు.

ఆచూకీ తెలిసిపోతుందని ఫోన్ కూడా వాడని వంశీ..!
వంశీ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు… హైదరాబాద్‌లో ఆయన అనుచరులు ఉన్నచోటును గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వంశీ… పోలీసుల నుంచి తప్పించుకుని… ఆ తర్వాత ఫోన్‌ కూడా వదిలేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నదీ కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫోన్‌ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున… ఇతరుల ఫోన్‌ నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడటం లేదంటున్నారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు.

వంశీ ఆచూకీపై సస్పెన్స్..
ప్రస్తుతం వంశీ ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియడం లేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారని కొందరు చెబుతుండగా, గోవాలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించి ఆయన ఎప్పుడో అమెరికా చెక్కేశారని కొందరు అంటున్నా… ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు పోలీసులు. ఇతర దేశాలకు వెళితే ఆయన పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించవచ్చని చెబుతున్నారు. దీంతో వంశీ ఎక్కడ ఉన్నదీ సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మోస్ట్‌ వాటెండ్‌ పొలిటీషియన్‌గా మారిపోయారు వల్లభనేని వంశీ. ఆయన పట్టుబడితే ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో గానీ… పోలీసులకు చిక్కకుండా వంశీ తనకు తాను శిక్ష అనుభవిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

Also Read : అలా చేస్తే ఎవరినీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు