దారుణ ఓటమితో రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై, తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ?

ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌గా మారిన రోజా... స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

దారుణ ఓటమితో రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై, తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ?

Gossip Garage : పుట్టినింట రాజకీయాల్లో రాణించిన ఆ మహిళా నేత.. మెట్టినింట అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా? రెండు సార్లు ఎమ్మెల్యేగా… మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ నేత… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారా? ఎంత సేవ చేసినా ఓడిపోయాననే ఆవేదన… సొంత క్యాడర్‌ కూడా సహకరించడం లేదన్న ఆక్రోశం ఏపీ పాలిటిక్స్‌పై విసుగు తీసుకొచ్చిందట… అందుకే తన మెట్టినిల్లు అయిన పక్క రాష్ట్రంలో పాలిటిక్స్‌పై మక్కువ పెంచుకుంటున్నారట… పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిబేట్‌కు తెరతీసిన ఆ మహిళా నేత ఎవరు? ఆమె పొలిటికల్‌ జర్నీలో అనూహ్య నిర్ణయం ఏంటి?

మళ్లీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచన..
ఏపీ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా… తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో కీలకంగా పని చేసిన రోజా… చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఇక తన వాగ్ధాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌గా మారిన రోజా… స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అరవ రాజకీయాల్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే విషయమై సన్నిహితులతో చర్చ..
నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా… మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశ పడ్డారు. కానీ, కూటమి హవాలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఊహకందని విధంగా తన పరాజయంతో నిరూత్సాహానికి గురైన రోజా… రెండు నెలలుగా నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎక్కువగా తమిళనాడులోని గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రోజా… ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆమెకు తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్‌ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్‌తో తమిళనాడులో రాణిస్తానని ఊహిస్తున్నారట రోజా. తన భర్త సెల్వమణి తమిళనాడుకే చెందిన వారు కావడం, తనకు తమిళ్‌ బాగా వచ్చి ఉండటంతో అరవ రాజకీయాల్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే విషయమై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

మెట్టినిల్లులో రాజకీయ భవితవ్యం తేల్చుకోడానికి సిద్ధం?
పుట్టింట రాజకీయాలు చూసిన రోజా… ఇప్పుడు మెట్టినిల్లులో రాజకీయ భవితవ్యం తేల్చుకోడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయమై ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ప్రతిపక్ష ఏఐడీఎంకే అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇక స్టార్‌ హీరో విజయ్‌ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో చేరితే బాగుంటుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ ఎవరికి ఉంటుంది? అనే విషయాలపై రోజా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

హీరో విజయ్ పార్టీలోకి రోజా?
ఇదే సమయంలో హీరో విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కజగంలో రోజా చేరతారనే ప్రచారం ఇంకోవైపు జరుగుతోంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం… కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా తమిళ వెట్రి కజగం పార్టీపై రోజా ఆసక్తికి కారణమంటున్నారు. దీంతో హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. విజయ్ పార్టీలో క్రియాశీలక పదవి తీసుకొని, ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారని అంటున్నారు.

అంతా కలిసి తనను మోసం చేశారన్న ఆవేదనలో రోజా..!
రోజా తమిళ రాజకీయాల వైపు మళ్లడానికి నగరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత రెండేళ్లుగా నగరి నియోజకవర్గంలో ఆమె అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం కాకుండా, ఆమెను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసి మరీ అన్నంత పనీ చేశారు. రోజా ఓటమి తర్వాత కూడా కొందరి నేతలు ఆగ్రహం చల్లార లేదంటున్నారు. భవిష్యత్‌లోనూ రోజాకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో రోజా సైతం నగరి పార్టీ కేడర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అంతా కలిసి తనను మోసం చేశారన్న ఆగ్రహం… ఆవేదన రోజాలో కనిపిస్తున్నాయంటున్నారు. దీంతో నగరిలో ఉన్న ఆ కాస్త నేతలు కూడా ఇకపై రోజాకు సహకరిస్తారన్న నమ్మకం కలగడం లేదంటున్నారు.

ఏపీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం?
ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నగరి పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం లేకపోవడంతోనే రోజా ఏపీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నగరి నుంచి పూర్తిగా చెన్నైకు మకాం మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న స్థితిలో ఏపీని వదిలి ఒక కొత్త చోటుకు వెళితేనే తన పొలిటికల్ కెరీర్ బాగుంటుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి తమిళనాడు సరైన ఎంపికగా రోజా నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?