చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతోంది, ప్రశ్నించకూడదనే దాడులు- జగన్

ఇప్పటికైనా దాడులు ఆపి పరిపాలనపై ఫోకస్ పెట్టాలని సూచించారు జగన్.

చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతోంది, ప్రశ్నించకూడదనే దాడులు- జగన్

Ys Jagan : కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్. పాలనపై ఫోకస్ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడంపై ఫోకస్ పెట్టారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు జగన్. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడుతున్నారని జగన్ అన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అమ్మఒడి, రైతు భరోసా అన్నీ ఎగ్గొట్టేశారని జగన్ ఆరోపించారు. దీనిపై ఎవరూ ప్రశ్నించకూడదనే దాడులతో భయాందోళనకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా దాడులు ఆపి పరిపాలనపై ఫోకస్ పెట్టాలని సూచించారు జగన్. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ అయినా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు జగన్.

”నవాబ్‌పేటలో అత్యంత దారుణంగా దాడి చేశారు. టీడీపీ వాళ్లు కిరాతకాలు, దారుణాలు చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే ప్రజలు భయపడిపోరు. మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారు? అతి కొద్ది సమయంలోనే చంద్రబాబు మీద వ్యతిరేకత పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి గవర్నెన్స్‌ మీద దృష్టి పెట్టడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మీద దృష్టి లేదు. హామీలు ఇచ్చి రైతులు, తల్లులు, విద్యార్థులు ఇలా అందరినీ మోసం చేశారు. రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా ఇవన్నీ ఎగ్గొట్టేశారు.

మేం క్రమం తప్పకుండా ఇచ్చి ఆదుకున్నాం. వీటి గురించి పట్టించుకోకుండా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. స్కూళ్లు, చదువులు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. ఎవరూ ప్రశ్నించకూడదని భయాన్ని సృష్టించాలని చూస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోమని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి భయానక వాతావరణం సృష్టించారు. ఇది తప్పుడు సంప్రదాయం. మీ ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతుంది.

రేపు మా ప్రభుత్వం వస్తే.. మా కార్యకర్తలు బుద్ధి చెప్పే తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం వేస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడి తప్పిపోయింది. ఏం జరుగుతోందో చంద్రబాబుకు తెలియడం లేదు. మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయి. చంద్రబాబును హెచ్చరిస్తున్నా. నంద్యాలలో ఏకంగా చంపేసిన ఘటన చూశాం. ఈ శుక్రవారం నేను అక్కడికి వెళ్లి పరామర్శిస్తా. జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం.

Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?

దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని అడుగుతున్నాం. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ఆయన ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాలని గవర్నర్‌ ని కోరుతున్నా” అని జగన్ అన్నారు.