చంద్రబాబు సంచలన నిర్ణయం..! బొత్సను ఢీకొట్టే సామర్థ్యం ఆయనకు ఉందా, ఎమ్మెల్సీగా గెలవగలరా?

టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్‌ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం దిలీప్‌ చక్రవర్తికి అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు సంచలన నిర్ణయం..! బొత్సను ఢీకొట్టే సామర్థ్యం ఆయనకు ఉందా, ఎమ్మెల్సీగా గెలవగలరా?

Gossip Garage : విశాఖ రేసులోకి టీడీపీ దూసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్‌ చక్రవర్తిని ప్రతిపాదించింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స నామినేషన్‌ వేయగా, ఆయనకు పోటీగా దిలీప్‌ చక్రవర్తి బరిలోకి దిగనున్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన దిలీప్‌ చక్రవర్తి అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యారు..? అధికారం అండతో ఎమ్మెల్సీగా దిలీప్‌ చక్రవర్తి గెలవగలరా? మాజీ మంత్రి బొత్సను ఢీకొట్టే సమర్థత… సామర్థ్యం దిలీప్‌కే ఉందని సీఎం చంద్రబాబు నమ్మారా? దిలీప్‌ చక్రవర్తి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి?

ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని దిలీప్‌ చక్రవర్తి..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకోవాల్సిన ఈ స్థానానికి ఇద్దరూ స్థానికేతరులు పోటీ చేయడం ఓ ఇంట్రెస్టింగ్‌ అంశమైతే…. పోటీ చేస్తున్న ఇద్దరూ విభిన్న రాజకీయ నేపథ్యం ఉన్న వారు కావడం ఇంకా ఆసక్తికరం. అధికార కూటమికి అరకొర బలం ఉన్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారిశ్రామికవేత్త భైరా దిలీప్‌ చక్రవర్తిని ఎంపిక చేశారు. టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్‌ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం దిలీప్‌ చక్రవర్తికి అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని దిలీప్‌ చక్రవర్తిని ఏకంగా పెద్దల సభకు పంపాలని నిర్ణయించడం, పైగా రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ అయిన మాజీ మంత్రి బొత్సపైనే పోటీకి దింపడం చర్చనీయాంశమవుతోంది.

బొత్స అయితేనే గెలవగలం అనే ఆలోచనలో జగన్..
రాజకీయాల్లో సీనియర్‌గా…. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా బొత్సకు గుర్తింపు ఉంది. వైసీపీలో ఎందరో ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించినా… బొత్స అయితేనే గెలవగలం అనే ఆలోచనతో ఆయనను బరిలోకి దింపారు మాజీ సీఎం జగన్‌. వాస్తవానికి వైసీపీ సిట్టింగ్‌ స్థానమైన విశాఖలో ఆ పార్టీ ఓటర్లే ఎక్కువ. కానీ, అధికారం చేతులు మారిన తర్వాత…. స్థానిక సంస్థల ఓటర్ల బలాబలాల్లోనూ కొంత మార్పు వచ్చింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీలు పకడ్బందీగా పావులు కదిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స అయితేనే తట్టుకోగలరని వైసీపీ ఆయనను రంగంలోకి దింపింది. పార్టీ ఆలోచనకు తగ్గట్టే బరిలోకి దిగిన బొత్స…. చకచక పావులు కదిపి… క్యాంపు రాజకీయాలతో వైసీపీ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవడంతోపాటు పార్టీలో పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు బొత్స.

వైసీపీ ఎంపీటీసీ, జడ్‌పీటీసీలు ఓట్లేస్తేనే బైరా దిలీప్‌కి విజయవకాశాలు!
ఇక బొత్సకు ప్రత్యర్థిగా తలపడనున్న భైరా దిలీప్‌ చక్రవర్తి…. పూర్తిగా కూటమి పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి అనితపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు దిలీప్‌ చక్రవర్తి. ఎంపీ అవ్వాలనే ఆలోచనతో చాలా కాలంగా అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ, బీజేపీతో పొత్తు వల్ల అనకాపల్లిలో పోటీ చేయాలనే దిలీప్‌ చక్రవర్తి ఆలోచన నెరవేరలేదు.

ఐతే ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీగా పోటీకి చాన్స్‌ దక్కించుకున్నారు. స్థానిక సంస్థల సభ్యులే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి పెద్దగా బలం లేదని చెబుతున్నారు. కానీ, ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పదికి పది స్థానాలను కూటమి గెలుచుకుంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటేయడంతోనే ఈ విజయం సాధించింది. ఇప్పుడు కూడా వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు ఓట్లేస్తేనే బైరా దిలీప్‌ చక్రవర్తికి విజయవకాశాలు ఉంటాయంటున్నారు.

అధికార బలంతో క్యాంపుల్లో ఉన్న వారిని వెనక్కి రప్పించగలరా?
ఐతే ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని దిలీప్‌ చక్రవర్తి…. స్థానిక ప్రతినిధుల ఓట్లను దక్కించుకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరోవైపు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కష్టపడి పనిచేసి.. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లతో మాట్లాడితే కొంతవరకు అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇది గమనించే కూటమికి ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అభ్యర్థి బొత్స… ఇప్పటికే ఓటర్లను క్యాంపులకు తరలించారు. టీడీపీ తన అధికార బలంతో క్యాంపుల్లో ఉన్నవారిని వెనక్కి రప్పిస్తేగానీ, వారితో మాట్లాడే అవకాశం ఉండదంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థి బైరా దిలీప్‌ చక్రవర్తి ఎలా నెట్టుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బొత్స వర్సెస్‌ బైరా దిలీప్‌ పోటీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.