Anagani Satya Prasad: జోగి రమేశ్‌ అడ్డంగా దొరికిపోయారు: మంత్రి సత్యప్రసాద్

తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు.

Anagani Satya Prasad: జోగి రమేశ్‌ అడ్డంగా దొరికిపోయారు: మంత్రి సత్యప్రసాద్

Anagani Satya Prasad

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన జోగి రమేశ్‌పై ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు.

జోగి రమేశ్ కుమారుడు, ఆయన బాబాయ్ ఇలా అంతా కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. అవకాశవాదిలా మాట్లాడుతున్న జోగి రమేశ్.. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు ఏం మాట్లాడారని నిలదీశారు. కుటుంబ లబ్ధి కోసం చేసిన భూ అక్రమణలు ఇప్పుడు రుజువు అవుతుంటే జోగి రమేశ్ ఇప్పుడు బీసీ కులం అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.

టీడీపీ ఎప్పుడూ కులాల గురించి మాట్లాడదని అన్నారు. అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారని గుర్తించాకే చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కడుందని నిలదీశారు. రూ.5 కోట్ల విలువైన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారని అన్నారు.

తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు. తండ్రి జోగి రమేశ్ చేసిన తప్పునకు ఆయన కుమారుడు ఇరుక్కున్నారని చెప్పారు. అధికారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని, అలాగే, అధికారుల బదిలీ కారణంగా రెవెన్యూ సదస్సులు నిర్వహణను వాయిదా వేస్తున్నామని తెలిపారు. 45 రోజుల పాటు ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థాన నిర్ణయం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Also Read: ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్