వైద్యుల భద్రతకోసం జాతీయ టాస్క్ ఫోర్స్.. మూన్నెళ్లలో మధ్యంతర నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

ఆస్పత్రులు, వైద్యుల రక్షణకోసం సుప్రీంకోర్టు పది మందితో జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.

వైద్యుల భద్రతకోసం జాతీయ టాస్క్ ఫోర్స్.. మూన్నెళ్లలో మధ్యంతర నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court : కోల్ కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు.. మంగళవారం విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించింది. విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు? అంటూ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపైనా మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్పిపాల్ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ఆలస్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును ఆగస్టు 22 కల్లా సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నల వర్షం

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చాలా మంది యువ డాక్టర్లు 36గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు.. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్ ను రూపొందించడం అత్యవసరమని కోర్టు అభిప్రాయపడింది. దీనికోసం పది మందితో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైద్యుల భద్రతకోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు నెలల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీకి సూచించింది.