Maruthi Nagar Subramanyam : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీ రివ్యూ.. ఫుల్‌గా పడీ పడీ నవ్వుకోవాల్సిందే..

మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఫుల్ గా నవ్వించేసారు.

Maruthi Nagar Subramanyam : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీ రివ్యూ.. ఫుల్‌గా పడీ పడీ నవ్వుకోవాల్సిందే..

Rao Ramesh Ankith Koyya Maruthi Nagar Subramanyam Movie Review and Rating

Maruthi Nagar Subramanyam Movie Review : రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణంలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో రిలీజ్ అయింది. మారుతీ నగర్ సుబ్రమణ్యం నేడు ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కడం, సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులకు నచ్చడం, సినిమాలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ రిఫరెన్స్ లు వాడటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్, సుకుమార్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే.. సుబ్రహ్మణ్యం(రావు రమేష్) చిన్నప్పట్నుంచి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా వచ్చిన ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉన్నా ఏది రాదు. ఈ లోపు పెళ్లి అయి భార్య కళారాణికి(ఇంద్రజ) గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సుబ్రహ్మణ్యంకు ఒక జాబ్ వచ్చినా అది కోర్టులో కేసు పడటంతో అపాయింట్మెంట్ రాదు. తన డబ్బులతోనే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం ఇంకా ఏదో జరుగుద్ది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకోని భార్య సంపాదన మీద బతికేస్తూ, భార్యకి భయపడుతూ ఉంటాడు.

సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్) తను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ తమ్ముడు అని కలలు కంటూ ఉంటాడు. తొలిచూపులోనే కాంచన(రమ్య)తో ప్రేమలో పడతాడు. ఒకరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. దీంతో అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలీక జుట్టు పీక్కుంటారు తండ్రి కొడుకులు. ఈ క్రమంలో అవసరాలతో ఆ డబ్బులు ఖర్చుపెట్టేస్తారు తండ్రి కొడుకులు. అసలు ఆ 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్ లో ఎవరు వేశారు? సుబ్రహ్మణ్యంకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అర్జున్ – కాంచనల ప్రేమ ఏమైంది? కళారాణి భర్త విషయంలో ఏం చేసింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Chiranjeevi birthday : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే.. నెట్టింట శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. ప‌వ‌న్, రామ్‌చ‌ర‌ణ్ మొద‌లు కొని..

సినిమా విశ్లేషణ.. ఇటీవల కొన్ని చిన్న సినిమాలు ఫుల్ గా నవ్విస్తూనే మంచి ఎమోషన్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఈ మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా కూడా ఫుల్ గా నవ్వించేసారు. రియల్ గా జరిగిన రెండు సీరియస్ పాయింట్స్.. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం.. ఈ రెండిటిని లింక్ చేస్తూ దర్శకుడు కామెడీ ఎంటర్టైనర్ కథగా బాగా రాసుకున్నాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులని నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు.

అయితే ఫుల్ గా కామెడీగా సాగిపోతున్న సినిమాలో మధ్య మధ్యలో ఎమోషన్ ట్రాక్ పెట్టడంతో ఆ సీన్స్ అక్కడ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సుబ్రహ్మణ్యం, అతని ఫ్యామిలీ గురించి, అర్జున్ ప్రేమ కథ గురించి, కాంచన ఫ్యామిలీ గురించి, సుబ్రహ్మణ్యం అకౌంట్ లో డబ్బులు పడి ఖర్చుపెట్టడం గురించి చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ డబ్బులు ఖర్చుపెట్టాక వచ్చే కష్టాలతో సాగి క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. రెండు మూడు సీన్స్ తప్ప సినిమాలోని ప్రతి సీన్ కి నవ్వుతూనే ఉంటారు ప్రేక్షకులు. సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్సులు చాలానే ఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగే. ఇక హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ ని కొత్తగా రాసుకున్నారు. వాళ్ళ మధ్య జరిగే సీన్స్ కూడా ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. అసలు రావు రమేష్ ని మెయిన్ లీడ్ గా తీసుకొని అతని చుట్టూ కథ రాసుకోవడమే గ్రేట్ అంటే ఆ కథతో ప్రేక్షకులని మెప్పించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మన అకౌంట్ లో ఎవరు డబ్బులు వేసారో తెలియకుండా డబ్బులు పడితే వచ్చే మనోవేదనని మంచి కామెడీగా తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రావు రమేష్ ఇన్నాళ్లు ఎమోషన్, ఫాదర్, సీరియస్ పాత్రల్లో మెప్పించి అప్పుడప్పుడు కామెడీలో కనపడ్డా మారుతీ నగర్ సుబ్రమణ్యంలో ఫుల్ లెంగ్త్ కామెడీతో అదరగొట్టేసారు. ఆయన ఇచ్చే చిన్న చిన్న డైలాగ్స్, హావభావాలు కూడా నవ్వు తెప్పిస్తాయి. కష్టపడే భార్య పాత్రలో ఇంద్రజ మెప్పించింది. అంకిత్ కొయ్య ఇటీవల వరుస సక్సెస్ లు కొడుతూ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో రావు రమేష్ పాత్రతో కలిసి ఫుల్ గా నవ్వించడమే కాక హీరోయిన్ పక్కన కూడా మెప్పించాడు. ఫ్యూచర్ లో అంకిత్ మంచి హీరో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రమ్య పసుపులేటి మాత్రం అందాల ప్రదర్శన వరకే అంకితమైంది. కానీ అక్కడక్కడా తన క్యారెక్టర్ తో కూడా నవ్వించారు. హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, నూకరాజు.. ఇలా మిగిలిన నటీనటులు కూడా బాగానే నవ్వించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల బాగున్నా మరి కొన్నిచోట్ల పర్వాలేదనిపించింది. కామెడీ RR బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకొంచెం కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కొత్త కథ, కొత్త కథనంతో దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమాని పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఇక నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టి తెరకెక్కించారు నిర్మాతలు.

మొత్తంగా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా జాబ్ లేని ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ అకౌంట్ లో అనుకోకుండా పదిలక్షలు పడితే ఏం జరిగింది అని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.