చెరువులు కబ్జాలకు గురి.. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులే

డెక్కన్ పీఠ భూమిలో ఉన్న హైదరాబాద్‌కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహర్తి తీరేది.

చెరువులు కబ్జాలకు గురి.. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులే

చెరువులు కబ్జాలకు గురికావడంతో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో చిన్నపాటి వర్షం పడినా.. రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి. కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి… పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి భవిష్యత్‌‌‌‌లో ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరదలను నివారించాలంటే ఆక్రమణలను తొలగించి చెరువులను కాపాడడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న తొలగింపులతో లక్ష్యం నెరవేరుతుందా? అనేది చూడాల్సివుంది….

హైదరాబాద్‌ నగరంలో చెరువుల ఆక్రమణ నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చిచూస్తే హైదరాబాద్‌లో ఈ సమస్య తీవ్రత ఎక్కువనే చెబుతున్నారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం… భూమి విలువ వందల రెట్లు పెరిగిపోవడంతో ఆక్రమణలు, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇదే నగరానికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌ పూర్తిగా మెట్ట ప్రాంతం, సముద్రానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశం.

డెక్కన్ పీఠ భూమిలో ఉన్న హైదరాబాద్‌కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహర్తి తీరేది. వర్షం పడితేనే నీరు, లేకుంటే గుండె చెరువు అన్నట్లు తయారైంది హైదరాబాద్‌ పరిస్థితి. ఇక్కడ పడే ప్రతి నీటి చుక్కను కాపాడి ప్రజల అవసరాలను తీర్చడానికి వందలాది చెరువులు తవ్వగా, అవేవీ ఇప్పుడు కనిపించకపోవడం ఆందోళనకరం.

నీటి వనరులను ధ్వంసం చేస్తుండటం అత్యంత ప్రమాదమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. వర్షపు నీరు పట్టుకుని వాడుకునే వ్యవస్థలో ఇప్పటికీ చెరువుది కీలక భూమిక. చెరువులు ఉంటేనే చల్లదనం, పచ్చదనం, ఆహారం, జీవ వైవిధ్యం. కానీ, రియల్‌ భూమ్‌తో కాసులకు కక్కుర్తి పడి చెరువులను చెరబడుతున్నారు.

ఇప్పటికే నగరంలో వందలాది చెరువుల్లో భవనాలు, వ్యాపార సముదాయాలు వెలిశాయి. నీటి వనరులను భూములుగా మార్చే వ్యాపార వస్తువుగా మార్చేయడంతో నగరంలో చెరువులు క్రమంగా కనుమరుగయ్యాయి. చెరువుల రక్షణకు చట్టాలు ఉన్నా, ఇన్నాళ్లు అవేవీ సక్రమంగా అమలు కాలేదు. ఫలితంగా నీటి కుంటలు కాలనీలుగా మారాయి.

Also Read: హైదరాబాద్‌లో చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు.. పూర్తి వివరాలు ఇదిగో