ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున ‘బిగ్ బాస్’కే బాస్.. ఆ డబ్బంతా ప్రభుత్వం కక్కించాలి: సీపీఐ నారాయణ

సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లోనే ఆయనకు వందల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు.

ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున ‘బిగ్ బాస్’కే బాస్.. ఆ డబ్బంతా ప్రభుత్వం కక్కించాలి: సీపీఐ నారాయణ

హైడ్రా అధికారులు శనివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున ‘బిగ్ బాస్’కే బాస్ అని అన్నారు. సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లోనే ఆయనకు వందల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు.

అయినప్పటికీ నాగార్జునకు అంత ఆశ ఎందుకని, చెరువు ఎఫ్టీఎల్‌లో ఉండగా ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటని నిలదీశారు. చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌లో సంపాదించిన డబ్బును ప్రభుత్వం కక్కించాలని వ్యాఖ్యానించారు. నష్టపరహారం కూడా కట్టించాలని, ఇలా వసూలు చేసిన డబ్బులతో పేదవారికి ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కబ్జాకోరని, ఆయనతో పాటు మరి కొంతమంది కబ్జాకోరులు ఉన్నారని చెప్పారు. పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో నాళాలు, చెరువుల కుంటలు, కబ్జాలు కావడంతో 10 నిమిషాలు వర్షం పడితే నగరం నరకంగా మారుతోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పారదర్శకంగా వ్యవహరించాలని, ఏ పార్టీ వారైన సరే అక్రమ నిర్మాణం చేపడితే కూల్చేయాల్సిందేనని అన్నారు.

Also Read: హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో పాటు హైదరాబాద్‌లో ఎవరెవరి అక్రమ నిర్మాణాలను కూల్చేశారో తెలుసా?