Jay Shah Journey : జిల్లా స్థాయి నుంచి ఐసీసీ చైర్మన్ వరకు.. జైషా ప్రస్థానం సాగిందిలా..

జై షా చాలా చిన్న వయస్సు నుంచి క్రికెట్ పరిపాలన విభాగంతో సంబంధం కలిగి ఉన్నాడు. 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ (అహ్మదాబాద్) ఎగ్జిక్యూటీవ్ బోర్డు సభ్యుడైనప్పుడు ..

Jay Shah Journey : జిల్లా స్థాయి నుంచి ఐసీసీ చైర్మన్ వరకు.. జైషా ప్రస్థానం సాగిందిలా..

Jay Shah

ICC Chairman Jay Shah : ఊహాగానాలు నిజమయ్యాయి. ఐసీసీ పీఠాన్ని మరోసారి భారతీయుడు అధిరోహించనున్నాడు. నాలుగేళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా చక్రం తిప్పుతున్న జై షా ఐసీసీ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసీసీ చైర్మన్ అయిన అత్యంత పిన్నవయస్కుడిగా (35ఏళ్లు) జైషా ఘనత సాధించాడు. జై షా చాలా తక్కువ సమయంలో ఉన్నత స్థానాలను అదిరోహించాడు. ఆయన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి ఎప్పుడు అడుగు పెట్టాడు.. ఎప్పుడు ఏ బాధ్యతలను చేపట్టాడు.. ఐసీసీ చైర్మన్ పదవికి చేరుకొనేందుకు ఆయనకు ఎంత కాలంపట్టింది.. అనే విషయాలను తెలుసుకుందాం.

Also Read : ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నిక

జైషా ప్రస్థానం సాగిందిలా..
జై షా చాలా చిన్న వయస్సు నుంచి క్రికెట్ పరిపాలన విభాగంతో సంబంధం కలిగి ఉన్నాడు. 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ (అహ్మదాబాద్) ఎగ్జిక్యూటీవ్ బోర్డు సభ్యుడైనప్పుడు అతని వయస్సు కేవలం 21ఏళ్లు మాత్రమే. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో అతని స్థాయి క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాలుగేళ్ల తరువాత 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) లో జాయింట్ సెక్రటరీ పదవిని జైషా చేపట్టాడు. అప్పట్లో జై షా తండ్రి, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జేఏసీ అధ్యక్షుడిగా ఉండేవారు. జీసీఏ జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగే సమయంలో జైషా పలు స్టేడియంల నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. అందులో నరేంద్ర మోదీ స్టేడియం పున:నిర్మాణం కూడా ఉంది. 2025లో బీసీసీఐలో జైషా అడుగు పెట్టాడు. 2015 సంవత్సరంలో బీసీసీఐలోని ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీలో సభ్యుడిగా జైషా ఎంపికయ్యారు. ఆ సమయంలో అతను చాలా సంవత్సరాలు జీసీఏ జాయింట్ సెక్రటరీగా కూడా కొనసాగాడు. 2019లో జీసీఏ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన నెల రోజుల తరువాత అతను బీసీసీఐ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. బీసీసీఐ కార్యదర్శి పదవికి ఎంపికయిన అతి చిన్న వయస్కుడు జైషానే కావడం విశేషం. 2022లో పదవీకాలం ముగిసినప్పటికీ.. మళ్లీ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2025లో ఆ పదవీకాలం ముగియనుంది.

Also Read : Womens T20 World Cup 2024 : బ్రేకింగ్‌.. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..

ఏసీసీలో కీలక బాధ్యతలు..
బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతూనే 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ జైషా బాధ్యతలు చేపట్టారు. షా పదవీకాలం 2024 ప్రారంభంలో ముగిసింది. తదుపరి ఏసీసీ అధ్యక్షుడిని శ్రీలంక నుంచి ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జైషా పదవిలో కొనసాగడానికి మద్దతుగా తన ఓటు వేశారు. క్రికెట్ పరిపాలనా విభాగంలో తన ప్రస్తానం ప్రారంభించిన నాటి నుంచి జైషా ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే, జైషా ఎదుగుదలకు కేవలం రాజకీయ అండదండలే కాదు.. అతని ప్రతిభకూడా ఐసీసీ చైర్మన్ స్థాయి వరకు తీసుకొచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో, ఏసీసీ అధ్యక్షుడి హోదాలో అనేక కీలక నిర్ణయాలు జైషా తీసుకున్నారు. రోజురోజుకు క్రికెట్ ను బలోపేతం చేయడంలో జైషా నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే చెప్పొచ్చు.

2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల ఒప్పందంతో సహా బీసీసీఐ కార్యదర్శిగా షా చెప్పుకోదగిన విజయాలు సాధించారు. ఐపీఎల్ ప్రతి మ్యాచ్ విలువ పరంగా ప్రపంచ వ్యాప్తంగా రెండో అత్యంత విలువైన క్రీడా లీగ్ గా గుర్తింపు పొందింది. తొలి స్థానంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఉంది. కోవిడ్ సమయంలో ఐపీఎల్ నిర్వహించడం, మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను ప్రారంభించడం వంటివి బీసీసీఐ బోర్డు కార్యదర్శగా జైషా ఉన్న సమయంలో సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చు.

ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు..
భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో ఐదో వ్యక్తి జైషా. ఇప్పటి వరకు జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు ఐసీసీ చైర్మన్లుగా కొనసాగారు. ప్రస్తుతం జైషా ఐసీసీ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. డిసెంబర్ నెలలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తుల్లో అతి చిన్న వయస్సు కలిగిన వ్యక్తి జైషానే కావటం విశేషం.