తన వీడియోలను లైక్ చేసి షేర్ చేయాలని కార్యకర్తలకు ఆదేశాలు.. ఆ సీనియర్ మంత్రికి ఏమైంది?

ఎప్పుడూ లేని విధంగా మంత్రి సోషల్‌ మీడియాపై మోజు పెంచుకోవడం... రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్‌ బిల్డప్‌ చేసుకునేలా అడుగులు వేయడమే రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది.

తన వీడియోలను లైక్ చేసి షేర్ చేయాలని కార్యకర్తలకు ఆదేశాలు.. ఆ సీనియర్ మంత్రికి ఏమైంది?

Gossip Garage : నచ్చితే లైక్‌ చేయండి.. షేర్‌ చేయడం మాత్రం మరచిపోకండి… ఇలాంటి రిక్వెస్టులు ఎన్నో విని ఉంటారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు, యూట్యూబర్లు తమ కంటెంట్‌ను ప్రచారం చేసుకోవడం కోసం ఈ తరహా రిక్వెస్ట్ చేస్తుంటారు. నచ్చిన వాళ్లు లైక్‌ చేస్తారు.. వీలుంటే షేర్‌ చేస్తారు. దీంతో చాలా మంది సోషల్‌ మీడియా సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఇక పాలిటిక్స్‌లోనూ సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో కొందరు నేతలు కూడా తమ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాంలు, ఉద్యోగులను నియమించుకుని ప్రచారం చేయడం కామన్‌గా మారిపోయింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి కూడా ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారట. తన వీడియోలను లైక్‌ చేసి షేర్‌ చేయమని కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నారట.

సోషల్‌ మీడియాలో ప్రచారం లేకపోవడం వల్లే కీలక పదవి మిస్ అయ్యిందట..
దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్‌ మంత్రి సోషల్‌ మీడియాపై మోజు పెంచుకుని, కార్యకర్తలకు వింత టార్గెట్లు పెడుతుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిందని… సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం జరిగితే తాను అంత పెద్ద లీడర్‌ అవుతానని భావిస్తున్న ఆ మంత్రి తన కోసం ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేసి ప్రచారం హోరెత్తించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సోషల్‌ మీడియాలో ప్రచారం లేకపోవడం వల్లే రాష్ట్రంలో కీలక పదవిని అందుకోలేకపోయానని మదనపడుతున్న ఆ మంత్రి… వచ్చే ఎన్నికల నాటికి ఆ లోటు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ముఖ్య పదవికి పోటీ పడాలనేది ప్లాన్..
అనుభవం, అర్హత ఉన్నా ముఖ్య పదవి మిస్‌ అవ్వడానికి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోలేకపోవడం ఓ ప్రధాన కారణంగా సదరు మంత్రి ఆవేదన చెందుతున్నారట. ప్రస్తుత తరానికి కనెక్ట్‌ అవ్వాలంటే సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అవ్వడం ఒక్కటే మార్గమని భావిస్తున్న మంత్రి… ప్రత్యేకంగా గ్రూపులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వాట్సాప్‌లో వేలాది గ్రూపులను క్రియేట్‌ చేసిన మంత్రి.. ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ లలో కూడా తన కోసం ప్రత్యేక పేజీలను డిజైన్‌ చేయించినట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి అన్ని రకాల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో పాపులర్‌ నేతగా గుర్తింపు తెచ్చుకుని ముఖ్యపదవికి పోటీ పడాలనేది ఆ మంత్రి ప్లాన్‌ అని చెబుతున్నారు. దీంతో తన వీడియోలను ప్రతి కార్యకర్త లైక్‌ చేసి షేర్‌ చేయాలని కోరుతున్నారు. మరీ దగ్గరి వారైతే లైక్‌లు చేస్తున్నారా? షేర్‌ చేస్తున్నారా? అంటూ ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

అస్తమానం లైక్ లు, షేర్‌లు చేయలేక కార్యకర్తలు సతమతం..
రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియా ప్రభావాన్ని గుర్తించలేకపోయారట… ఇక ఆ ఎన్నికలతోపాటు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన నేతలకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని భావించి… పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తన ప్రతి వీడియో ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ అవ్వాలని కార్యకర్తలకు హుకుం జారీ చేశారట. పనులపై తన వద్దకు వచ్చే వారు.. సోషల్‌ మీడియాలో తన వీడియోలు ఫాలో అవుతున్నది లేనిదీ కూడా తెలుసుకుంటున్నారట.

ఒకప్పుడు హుందాగా రాజకీయాలు చేసిన మంత్రి… ఇప్పుడు చిన్న వీడియో కూడా ప్రచారం చేసుకోవాలని కోరుకోవడంతో కార్యకర్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతలో ఇంత ప్రచార పిచ్చి ఎప్పుడూ చూడలేదని… కానీ, ఇప్పుడు అవసరానికి మించి ప్రయాస పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇష్టమైన నేత కోరిక కాదనలేక.. అస్తమానం లైక్ లు, షేర్‌లు చేయలేక సతమతమవుతున్నారట కార్యకర్తలు.

వచ్చే ఎన్నికల నాటికి ఇమేజ్ పెంచుకోవాలనేదే ఆ నేత ప్లాన్..
తన సందేశాలు, ప్రభుత్వ పథకాలు, తాను వెళ్లిన కార్యక్రమాలకు విస్తృత ప్రచారం చేయడానికి ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన మంత్రి… అనుక్షణం ఆ గ్రూపుల్లో సమాచారం షేర్‌ అవుతుందీ లేనిదీ తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. తన ప్రతి అడుగు ప్రతి ఓటరుకు తెలియాలనేది మంత్రి ఆకాంక్ష. అదేవిధంగా తన అభిమానులతో తన పేరుతో సోషల్‌ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న మంత్రి.. ప్రతి సోషల్‌ సైనికుడు మరో 20 మందిని తన ఫాలోయిర్లుగా చేర్పించాలని సూచిస్తున్నారట.

ఇలా తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోషల్‌ సైనికులను నియమించుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా తన కార్యక్రమాలను ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన ఇమేజ్‌ పెంచుకోవాలనేది ఆ నేత ప్లాన్‌గా చెబుతున్నారు.

Also Read : ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!

ఎప్పుడూ లేని విధంగా మంత్రి సోషల్‌ మీడియాపై మోజు పెంచుకోవడం… రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్‌ బిల్డప్‌ చేసుకునేలా అడుగులు వేయడమే రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్క కీలక పదవి తప్ప పార్టీలో ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించిన మంత్రి… సోషల్‌ మీడియా ప్రభావంతో తన చిరకాల కోరిక నెరవేర్చుకునేలా అడుగులు వేస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.