వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

భవిష్యత్తులో విజయవాడకు వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చలు జరిపారు.

వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Vijayawada Floods : వరద బాధితులకు సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని పండగ రోజు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నామన్నారు. ఒకవైపు బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ మరోవైపు విజయవాడలో పారిశుధ్యం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు.

భవిష్యత్తులో విజయవాడకు వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చలు జరిపారు. రేపు సాయంత్రానికి విజయవాడలో వరద నీరు తగ్గుముఖం పడుతుందని చెప్పారు.

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ బెంగళూరు వెళ్లారు- మంత్రి సత్యకుమార్ యాదవ్
అటు విజయవాడలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధులపై సర్వే చేస్తున్నామని, 450 కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను విజయవాడకు రప్పించినట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బందుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లారని విమర్శించారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు. ఈ కారణంగా వారు జబ్బులు బారిన పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి వైద్య ఆరోగ్య శాఖపై రివ్యూ చేశారు. వరదలు వచ్చినప్పుడు కచ్చితంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వాటి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు.

గత కొన్ని రోజులుగా ప్రతి ఇంటికి కనీస మందులు ఏవి అవసరమో వాటిని ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. ఆరు రకాల మందులు.. జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలకు సంబంధించిన మెడిసిన్స్ ను ప్రతి ఇంటికి కిట్ ద్వారా చేర్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 124 మెడికల్ క్యాంపులు ఇవాళ కూడా జరుగుతున్నాయన్నారు. ప్రతి చోట ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారని, 75 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.