నేను కూడా టీపీసీసీ అధ్యక్షుడిని కావాలనుకున్నా.. ఎప్పటికైనా..: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పెద్దపార్టీ అని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా కావచ్చని అన్నారు.

నేను కూడా టీపీసీసీ అధ్యక్షుడిని కావాలనుకున్నా.. ఎప్పటికైనా..: జగ్గారెడ్డి

మహేశ్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిని ఇవ్వడంతో దీనిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నేతకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ భావించి మహేశ్ కుమార్ గౌడ్‌కు ఇచ్చిందని చెప్పారు.

ఏఐసీసీకి ధన్యవాదాలు చెబుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. తాను కూడా టీపీసీసీ అధ్యక్షుడి కావాలనుకున్నానని ఎప్పటికైనా అవుతానని చెప్పారు. కాంగ్రెస్ పెద్దపార్టీ అని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా కావచ్చని అన్నారు. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీకి పీసీసీ పదవి వచ్చిందని తెలిపారు.

బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు. ఈ పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారని, బీసీ కోణంలో మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కీ.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్, లక్ష్మణ్ ఉన్నారని చెప్పారు.

ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, శంకర్ పేర్లను పరిశీలించారని, అయితే, బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మహేశ్ కుమార్ గౌడ్‌కు ఆ పదవి ఇచ్చారని తెలిపారు. తనతో నిన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేశ్ కుమార్ పనిచేశారని, ఆయన అందర్నీ కలుపుకొని పోతారని భావిస్తున్నానని చెప్పారు. పార్టీ లైన్‌లో పనిచేసిన నేత మహేశ్ కుమార్ గౌడ్ అని తెలిపారు.

Also Read: చంద్రబాబును కలిసి రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్