Drip Irrigation : తక్కువ నీటితోనే అధిక విస్తీర్ణంలో పంటల సాగు.. రైతులకు వరంగా బిందు సేద్యం

Drip Irrigation : తక్కువ నీటితోనే అధిక విస్తీర్ణంలో పంటల సాగు.. రైతులకు వరంగా బిందు సేద్యం

Drip irrigation

Drip Irrigation : వ్యవసాయ రంగంలో రైతాంగం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య సాగు నీరు. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యడానికి అనుగుణంగా వ్యవసాయానికి నీటి అవసరం కూడా బాగా పెరిగిపోతోంది. కానీ అదే సమయంలో తరిగిపోతున్న మంచి నీటి  వనరుల లభ్యత వలన నీటి అవసరాన్ని తగ్గించడానికి కొన్నితక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకు రైతుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సూక్ష్మ నీటి పారుదల విధానం. బిందు, తుంపర్ల సేద్య విధానం తీరు తెన్నులు, దీనివల్ల ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు అనేది సకల జీవకోటికి ప్రాణాధారం. వ్యవసాయ రంగంలో అత్యదికంగా 84శాతం వరకు  ఈ నీటిని వినియోగిస్తున్నారు. జనాభా పెరుగుదల, రుతుపవనాల్లో ఒడిదుడుకులు, పరిశ్రమ అవసరాలు, గృహ అవసరాలు పెరుగుతుండటం వల్ల రానురాను  నీటి సమస్య  జఠిలమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో, మిగతా రంగాల్లో  నీటికోసం డిమాండ్ పెరిగి, వ్యవసాయ రంగానికి వచ్చే నీటి వాటా, తగ్గిపోయే ప్రమాదముంది.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

ప్రస్థుతం రైతులు అనుసరించే సంప్రదాయ విధానాల వల్ల ఎక్కువ నీటితో, తక్కువ భూమికి నీరు పారించే పరిస్థితి వుంది. దీనివల్ల నీటి వినియోగ సామర్ధ్యం చాలా తక్కువగా వుంది. దీనికి తోడు తరచూ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలాప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవటంతో, నీటి ఎద్దడితో రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి, సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని సమర్ధవంతంగా పెంచేందుకు రైతుల ముందున్న చక్కటి పరిష్కారం బిందుసేధ్యం.

వ్యవసాయ, ఉద్యాన పంటలలో వేటికైనా , డ్రిప్ నీటిపారుదల పద్ధతిని ఉపయోగించుకోవచ్చు.. డ్రిప్ పరికరాలు సమర్ధవంతంగా పనిచేయాలన్నా, మన్నిక ఎక్కువకాలం వుండాలన్నా, వీటిలో వుండే ఫిల్టర్స్., ఫ్లష్ వాల్స్ ను ఎప్పటికప్పుడు పరిక్షించుకుంటూ, శుభ్రం చేస్తూ వుండాలి. డ్రిప్ పైపుల నుంచి నీటి సరఫరా తగ్గినప్పుడు, ఇతరత్రా మలినాలు వల్ల పైపులనుంచి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు పైపులను యాసిడ్ తో శుభ్రపరుచుకోవాల్సి వుంటుంది.

పంటలకు నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా అందించే అవకాశం వుండటంతో రైతులకు కూలీల ఖర్చు చాలా వరకు తగ్గింది. ఈ విధానాన్ని ఫెర్టి గేషన్ అంటారు. ప్రధాన పోషకాలతోపాటు, సూక్ష్మపోషకాలనుకూడా డ్రిప్ ద్వారా అందించవచ్చు..  ఈ పద్ధతిలో ఎరువుల వృధా తగ్గి, మొక్కలకు పూర్తి స్థాయిలో ఎరువులు అందే అవకాశం ఏర్పడింది.

READ ALSO : Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!

డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రస్థుతం చిన్న, సన్నకారు రైతులకు  90శాతం వరకు రాయితీ లభిస్తోంది. ఎస్.సి, ఎస్.టి రైతులకు 100శాతం రాయితీ అందిస్తున్నారు. కాని రాయితీ సౌకర్యం 5ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒక్కో రైతుకు సబ్సిడీని లక్ష రూపాయలకు మించకుండా పరిమితం చేశారు.  పెద్ద రైతులకు ఈ సబ్సిడీ 60శాతంగా వుంది. అవకాశం వున్న రైతులు స్థానిక ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా, ఈ రాయితీలను ఉపయోగించుకుని బిందు సేధ్య పద్ధతితో సాగును సఫలీకృతం చేసుకోవచ్చు..

ప్రస్థుత పరిస్థితుల్లో బిందు సేధ్యం రైతులకు కల్పతరువు లాంటిదంటూ… ఈ సూక్ష్మనీటిపారుదల విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్త డా. ఎ.వి. రామాంజనేయులు…..