Ippa Puvvu : ఇప్ప చెట్టును నమ్ముకుని… పువ్వులు అమ్ముకుని

ఇప్ప పూలతో ఆదివాసీ గిరిజనులు వివిధ రకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహారపదార్ధాలను తయారు చేసుకుని ఏడాది పొడవునా నిల్వచేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాల, ఇప్ప సత్తు పిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనులు ఇప్ప పూలతో చేసే వంటకాల రుచి తినేవారికి పసందుగానే ఉంటాయని చెప్పవచ్చు

Ippa Puvvu : ఇప్ప చెట్టును నమ్ముకుని… పువ్వులు అమ్ముకుని

Ippa Flower (2)

Ippa Puvvu : అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనులకు ఇప్పచెట్టు వారి పాలిట వరంగా చెప్పాలి. వారి జీవన సంస్కృతిలో ఈ చెట్టు ఓ భాగమై పోయింది. కొండ ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ చెట్లు అడవి బిడ్డలకు ఆదరవుగా మారాయి. ఇప్ప చెట్టును నమ్ముకుని పువ్వులు అమ్ముకుంటూ గిరిజన కుటుంబాలు కాలం వెళ్ళదీస్తున్నాయి. వందల సంవత్సరాల కాలం నుండి ఇప్ప చెట్టు గిరిజనుల పాలిట కల్పవల్లిగా మారింది. రాజ్ గోండ్, కొలాం, ప్రధాన్, చెంచు, లంబాడా తెగలవారు తాము జరుపుకునే పండుగల సంబరాలకు ఇప్ప పువ్వు నైవేద్యాలను దేవుళ్ళకు పలహారంగా అందించటం ఆనవాయితీగా ఆచరిస్తున్నారు.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్ ఘర్, కర్ణాటక, మహరాష్ణ, కేరళ, గుజరాత్ ,మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఇప్పచెట్లు విరివిగా ఉన్నాయి. విప్ప చెట్టు 15 నుండి 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏడాదికి ఒక్కో ఇప్ప చెట్టు నుండి 80 కేజీల వరకు ఇప్ప విత్తనాల దిగుబడి వస్తుంది. అదే పూలైతే 150 కేజీల వరకు ఒక్కో చెట్టు నుండి లభిస్తాయి.

విప్పపూలు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఫలాలు కోలాకారంగా లేత ఆకు పచ్చ రంగులో ఉంటాయి. లేత పసుపు వర్ణం కలిగిన విత్తనాలు తెల్లటి గుజ్జును కలిగి ఉంటాయి. ఒక్కొక్క ఫలంలో ఒకటి నుండి నాలుగు వరకు విత్తనాలు ఉంటాయి. విత్తనాలు జనవరి నుండి మే మాసాంతం వరకు లభిస్తాయి.

ఎండిన పోయిన ఇప్ప పూల నుండి సారా ను తయారు చేస్తారు. పండుగల సందర్భాల్లో, ఆనంద సమయాల్లో గిరిజనులు ఈ పానీయాన్ని స్వీకరిస్తారు. ఇప్ప పూలను రోజు వారి ఆహారంగా కూడా తీసుకుంటారు. ఇప్ప చెట్టు ఆకులు, కాయలు, పువ్వులు, బెరడు ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్నాయి గిరిజనలు నమ్ముతారు.

అడివి బిడ్డలకు కల్పవృక్షం ఇప్పచెట్టు

అందుకే గిరిజనులు తాము నివాసముండే అటవీ ప్రాంత సమీపాల్లో చుట్టూ ఇప్పచెట్లు ఉండేలా చూసుకుని వసతి ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తారు. ఎండ బెట్టిన విప్ప పూలలో మాంసకృత్తులు, పిండి పదార్ధం , ఖనిజలవణాలు, పీచు పదార్ధం, క్యాల్సియం, పాస్పరస్, కెరోటిన్, విటమిన్ సి, సక్లోజ్, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పచెట్టు కలపను ఇంటి తలుపులు, గుమ్మాలు, కిటికిలు, ఎడ్లబళ్లచక్రాల తయారిలో వినియోగిస్తారు.

ఇప్ప పూలతో ఆదివాసీ గిరిజనులు వివిధ రకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహారపదార్ధాలను తయారు చేసుకుని ఏడాది పొడవునా నిల్వచేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాల, ఇప్ప సత్తు పిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనులు ఇప్ప పూలతో చేసే వంటకాల రుచి తినేవారికి పసందుగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్ప విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బులు, కొవ్వొత్తుల తయారీకి వినియోగించటంతోపాటు కీళ్ళనొప్పులు, చర్మరక్షణ తైలంగా వినియోగిస్తున్నారు.

ఇప్ప పువ్వులో ఉన్న పోషక విలువలు అధికంగా ఉండటంతో వీరి ఆహారాలను ఇతర ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నాన్ని తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గిరిజనుల జీవనోపాధి, ఆహార భద్రత నేపధ్యంలో గిరిజన మహిళా రైతులను భీంబాయి మహిళా సహకార సంఘాలుగా ఏర్పాటుచేసి ఆదివాసి ఆహారం అనే బ్రాండ్ తో ఇప్ప పువ్వులతో విలవ అధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. పండుగల సందర్భంలో ఇప్ప పూల ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వారి ఆహార ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించుకునేలా ప్రోత్సహిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఆదివాసి సహకార సంఘం నుండి ఇప్పపూలతో నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్, మిక్సిడ్ ఫ్రూట్ జామ్, జెల్లీ వంటి ప్రాచుర్యం ఉన్న ఆహార పదార్థాలను తయారు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.