Teak cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న టేకు సాగు

ఒక ఎకరానికి 600 మొక్కలు నాటవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి.

Teak cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న టేకు సాగు

Take Wood

Teak cultivation : తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఈ మధ్యకాలంలో టేకు సాగుపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పొలం గట్లు, ఖాళీ స్ధలాల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. నాణ్యమైన, దృఢమైన, అతి ఖరీదైన కలప నిచ్చే మొక్కల్లో టేకు మొక్కలకు అధిక ప్రాముఖ్యత కలదు. మన తెలుగు రాష్ట్రంలో టేకు మొక్కల పెంపకానికి అన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉండడంతో చాలామంది రైతులు టేకు మొక్కలను ప్రధాన పంటగా సాగు చేపడుతున్నారు. మార్కెట్లో నాణ్యమైన టేకు కలపకు మంచి డిమాండ్ ఉంది. అదే క్రమంలో డిమాండ్ కు తగ్గట్టుగా కలప దొరకటం లేదు. దీంతో చాలా మంది ఇంటి సామాగ్రి కోసం ఇతర కలపపై అధారపడాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో టేకు రైతులకు సాగు లాభసాటిగా మారింది.

టేకు మొక్కలను సాధారణంగా విత్తనాలు లేదా పిలకల నుండి సహజ పునరుత్పత్తి చేయవచ్చు. లేదా టిష్యూకల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం టిష్యూకల్చర్ టేకు మొక్కలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. టేకు మొక్కలు నీటి ముంపుకు లేని అన్ని రకాల నేలల్లో సమృద్ధిగా పెరుగుతాయి. టేకు మొక్కల సాగులో మనం తీసుకునే యాజమాన్య పద్ధతులు,వాతావరణ పరిస్థితులను బట్టి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల్లో అధిక నాణ్యమైన కలప తయారవుతుంది.

ఒక ఎకరానికి 600 మొక్కలు నాటవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. ఆరు నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదుల సక్రమంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక ఘనపు అడుగు టేకు కర్రకు రూ. 2 వేల నుంచి రూ.2500 వరకు ధర పలుకుతోంది. 12 ఏండ్లు పెంచితే 12 అడుగుల వరకు వరకు టేకు లభించే అవకాశం ఉంటుంది. ఎకరం పొలంలో టేకు చెట్ల నుండి పెట్టుబడి, పర్మిట్‌ ఖర్చులుపోగా రూ.20 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది.

అంతర కృషి, కలుపు నివారణ : ప్రధాన పొలంలో సరైన అంతరకృషి, కలుపు నివారణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం చెట్ల మధ్య లోతుగా దున్నాలి. పాదుల్లో కలుపు మొక్కలను దున్నిన తర్వాత మిగిలిన వాటిని తీసివేసి పాదులను బాగు చేయాలి.మొక్కలు నాటిన 2 నెలల తర్వాత 4 కిలోల పశువుల ఎరువు వేయాలి. టేకు మొక్కల్లో చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. వేరు పురుగు సమస్య ఉన్న నేలల్లో 2 చ.మీ.కు 1 టీ చెంచా కార్బోప్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును నివారించవచ్చు. ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళ మొక్కలకు ఆశించినట్లు అయితే లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ పిచికారీ చేసి తెగుళ్లను నివారించవచ్చు.

మొక్కల ఎదుగుదల తర్వాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది.స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని, చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తర్వాత రేంజి పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు, పట్టా భూమిలోనివా., లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధ్రువీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత ప్రయోజనం చేకూరుతుంది.