టీడీపీకి మరో షాక్, చింతమనేనికి 14 రోజుల రిమాండ్, జైలుకి తరలింపు

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్ లు ఇస్తోంది

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 07:20 AM IST
టీడీపీకి మరో షాక్, చింతమనేనికి 14 రోజుల రిమాండ్, జైలుకి తరలింపు

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్ లు ఇస్తోంది

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్ లు ఇస్తోంది జగన్ ప్రభుత్వం. ఈఎస్ఐ స్కామ్ లో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బస్సుల కొనుగోలు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు ఏలూరు జైలుకి తరలించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

చింతమనేనికి కరోనా నెగిటివ్:
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుని వ్యతిరేకిస్తూ నిన్న(జూన్ 12,200) ఏలూరు సమీపంలో కలపర్రు టోల్ గేటు దగ్గర తన అనుచరులతో నిరసన చేయడానికి చింతమనేని ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసన చేయకుండానే చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకి నిరసనగా నిన్నటి నుంచి ఆయన పోలీస్ స్టేషన్‌లోనే దీక్షకు దిగారు. పోలీసు విధులకు ఆటంకం కలించారంటూ చింతమనేనిపై ఐపీసీ సెక్షన్ 353తో పాటు మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని నిర్ణయించారు. ముందస్తు జాగ్రత్తగా చింతమనేనికి పోలీసులు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. ఆయనకు నెగిటివ్ అని తేలడంతో ఈరోజు(జూన్ 13,2020) ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట చింతమనేనిని పోలీసులు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు. ఈ కేసులో మరో ఏడుగురికి కూడా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీనిపై చింతమనేని స్పందించారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కనీసం క్వారంటైన్ కైనా పంపాలని మేజిస్ట్రేట్ ను చింతమనేని కోరారు.

టీడీపీకి వరుస షాక్‌లు:
ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు నిన్న(జూన్ 12,2020) అరెస్ట్ చేసింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే బస్సుల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ఇవాళ(జూన్ 13,2020) అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు. దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాలు రిమాండ్ విధించారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.