ఏపీలో రాజకీయ దుమారం లేపిన 3 రాజధానుల బిల్లు

  • Published By: murthy ,Published On : August 1, 2020 / 04:59 PM IST
ఏపీలో రాజకీయ దుమారం లేపిన 3 రాజధానుల బిల్లు

మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్‌ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించింది. ఇక వైసీపీ విపక్షాల ఆరోపణలను పట్టించుకోబోమని రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమంది.



మూడు రాజధానుల బిల్లుకు ఎట్టకేలకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉంచిన బిల్లుపై న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత రాజముద్ర వేశారు. దీంతో ఏపీలో పొలిటికల్‌ గేమ్‌ స్టార్ట్‌ అయ్యింది. గవర్నర్‌ మూడు రాజధానుల బిల్లును ఆమోదించడంపై టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమన్నారు. రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.



గవర్నర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా తప్పుపట్టింది. హైకోర్టులో దీనిపై కేసుఉండగా… గవర్నర్‌ ఎలా ఆమోదముద్ర వేస్తారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. మండలిలోనూ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారని.. దానిపై ఎటూ తేలకుండానే ఎలా ఆమోదిస్తారన్నారు.

ఇక మూడు రాజధానుల నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. అమరావతి అంశానికి తాము కట్టుబడి ఉన్నామని.. రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.



ఇక మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయని, దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో బతుకుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాలన వికేంద్రీకరణపై కాకుండా ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపన నేపథ్యంలో.. రాజధాని రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు.మూడు రాజధానుల బిల్లుపై చెలరేగిన ఈ పొలిటికల్‌ హీట్‌ ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

ప్రతిపక్షాల విమర్శలకు వైసీపీ దీటుగా కౌంటర్‌ ఇచ్చింది. అభివృద్ధిని అడ్డుకోవడం చంద్రబాబు ఎప్పుడూ చేసే పనేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. అయినా విపక్షాల విమర్శలను పట్టించుకోబోమన్నారు.